రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం నుంచి బడిబాట కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహాలను గత నెల నుంచే రాష్ట్ర విద్యాశాఖ ప్రారంభించింది. దీనిలో భాగంగా గత నెల 9, 16, 26, 30 తేదీల్లో మొత్తం నాలుగు పీటీఎం (పేరేంట్ టీచర్స్ మీటింగ్స్) సమావేశాలు నిర్వహించారు. సర్కారు బడులకు వేసవి సెలవులు ఉన్నందున ఈ సమావేశాలను యథా ప్రకారం పాఠశాలల్లో కాకుండా జన సమ్మర్ధం ఉన్న ప్రదేశాలైన గ్రామాల్లోని కూడళ్లు, రచ్చబండ వంటి వివిధ ప్రదేశాల్లో ఈ సమావేశాలు జరిగాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల సభ్యులు కలిసి ప్రభుత్వ స్కూళ్ల పనితీరు గురించి ఈ సమావేశాల్లో ప్రజలకు వివరించారు. దీంతోపాటు ప్రభుత్వం వివిధ పథకాల పేరుతో సర్కారు బడుల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, వివిధ ప్రయోజనాలను వివరించారు.
‘మన ఊరు – మన బడి/ మన బస్తీ – మన బడి’ కార్యక్రమం పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.వందల కోట్లు వెచ్చించి సర్కారు బడులను అత్యున్నతంగా తీర్చిదిద్దిన విషయం విదితమే. ఈ సొమ్ముతో వేలాది పాఠశాలల్లో తగిన భౌతిక వనరులు, మౌలిక సదుపాయాలు సమకూరాయి. ఈ పథకంతో సర్కారు బడుల దశ తిరిగింది. గత సర్కారు ముందుచూపుతో చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో ప్రయోజనం పొందారు.
అదనపు తరగతి గదులు, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, వంట గదులు, భోజన శాలలు, ప్రహరీగోడలు, మరుగుదొడ్లు, మూత్రశాలల వంటి అనేక సదుపాయాలు సమకూరాయి. దీంతో ప్రభుత్వ బడులపై తల్లిదండ్రుల ఆలోచన దృక్పథం క్రమేపీ మారింది. దశాబ్దాల తరబడి బోసిపోతున్న ప్రభుత్వ పాఠశాల భవనాలు ఈ పథకాలతో ఆకర్షణీయంగా ముస్తాబయ్యాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్వయంగా విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం పాఠశాలల పనితీరులో నిజంగానే మార్పులు వస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు విశ్వసించారు.
దేశంలోనే తొలిసారిగా అన్ని ఉన్నత పాఠశాలలతోపాటు కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో 75 అంగుళాల నిడివి గల ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్లు సమకూరాయి. వీటి కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించారు. దానిపై ఉపాధ్యాయులందరికీ శిక్షణ కూడా ఇచ్చారు. పాఠశాలల రూపురేఖలు మారడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పటిష్టమైన పునాదిపై నేడు పాఠశాలలు సగర్వంగా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా పోటీ పడుతున్నాయి. అంతేగాక అనేక పాఠశాలలకంటే మిన్నగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు పాఠశాలలకు తగిన వసతులు తామే కల్పించామని చెప్పుకుంటూ పూర్తిస్థాయిలో ప్రచారం చేసి పాఠశాలల్లో విద్యార్థులు నమోదు పెంచాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీని అమలు కోసం తగిన ప్రణాళికను సిద్ధం చేసింది.
20 వరకూ బడిబాట..
ఈ నెల 6 నుంచి ఈ నెల 20 వరకు బడిబాట కార్యక్రమం జరగనుంది. ఖమ్మం డీఈవో సామినేని సత్యనారాయణ ఈ కార్యక్రమ నిర్వహణపై ఎంఈవోలు, హెచ్ఎంలకు ముందుగానే మార్గదర్శనం చేశారు. బడిబాట కార్యక్రమానికి సమన్వయకర్తగా సీఎంవో యలగందుల రాజశేఖర్ వ్యవహరిస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఆదేశించారు. గురువారం అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.