బోనకల్లు, నవంబర్ 13: బోనకల్లు మండలంలోని చొప్పాకట్లపాలెం పెను ప్రమాదం తప్పింది. చింతకాని మండలం నాగలవంచకు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు (School Bus) స్టీరింగ్ అకస్మాత్తుగా (స్టీరింగ్ లాక్) పట్టేసింది. దీంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సులో ఉన్న విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.
గురువారం ఉదయం విద్యార్థులను ఎక్కించుకుని నాగలవంచ వైపు వెళ్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సు, మూలమలుపు వద్దకు రాగానే స్టీరింగ్ పనిచేయడం ఆగిపోయింది. అదుపు తప్పిన బస్సు మూలమలుపు వద్ద నిలిపి ఉన్న ఆటోను ఢీకొట్టింది. అయితే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి బస్సును నిలిపివేశారు. దీంతో ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పిల్లలు సురక్షితంగా ఉన్నారని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఆటో డ్రైవర్ను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.