సత్తుపల్లి టౌన్, మార్చి 29: సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు గల్లంతైన సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. పట్టణంలోని ఎన్టీఆర్కాలనీకి చెందిన శివ (13), నాగబాబు (14) ఆదివారం మధ్యాహ్నం సమయంలో స్థానిక మెట్టాంజనేయస్వామి ఆలయ సమీపంలో ఉన్న క్వారీ గుంత వద్దకు ఈత కోసం వెళ్లారు.
అకడ నీటి లోతును సరిగ్గా అంచనా వేయలేక లోపలికి దిగారు. లోతు ఎకువగా ఉండటంతో ఇద్దరూ మునిగిపోతూ కేకలు వేస్తుండడంతో కొంతదూరంలో పశువులను మేపుతున్న మహిళ గమనించి విషయం సమీపస్తులకు చేరవేసింది. చుట్టుపక్కల వారు వచ్చేసరికి అప్పటికే వారు నీటిలో గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే సత్తుపల్లి మున్సిపల్ చైర్పర్సన్ రిహనా కమల్పాషా, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వార్డు కౌన్సిలర్లు జగన్నాథం శీను, శరత్చంద్ర హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.