Panchayathi Elections | అశ్వారావుపేట, డిసెంబర్ 5 : గ్రామ పంచాయతీ ఎన్నికల (Panchayathi Elections) వేడి ఊపందుకుంది. ఇప్పటికే మొదటి విడత నామినేషన్ల ప్రకియ పూర్తి కాగా.. రెండో విడత కొనసాగుతోంది. మూడో విడత ప్రక్రియ కూడా ప్రారంభమైంది. రాజకీయ పార్టీలకతీతంగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు జెండాల నీడలోనే సాగుతున్నాయి. పార్టీల నాయకులు పార్టీ సానుభూతిపరులు, అనుచరులను పోటీల్లో నిలుపుతున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా పోటీ చేసే అభ్యర్థులకు ‘కరెన్సీ కష్టాలు’ వెంటాడుతున్నాయి. చేతిలో చిల్లిగవ్వ లేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా పల్లెల్లో ఈ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. రాజకీయ పార్టీలైతే ప్రోత్సహిస్తున్నాయి గానీ కరెన్సీకి గ్యారెంటీ ఇవ్వడం లేదు. రాజకీయాలంటే మక్కువ ఉన్న వారు ఏదో విధంగా డబ్బులు సమకూర్చుకుంటుండగా.. మరికొందరు నేతలపైనే భారం వేస్తున్నారు.
దీంతో రాజకీయ ప్రాబల్యం కోసం నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత భుజాలపై పడటంతో ఎన్నికల ఖర్చు కోసం వెదుకులాట మొదలుపెట్టారు. అప్పుల కోసం పరుగులు తీస్తున్నారు. కొందరు స్థిరాస్తులను అమ్మకాలకు పెడుతున్నారు. అశ్వారావుపేట మండలంలో ఒక సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల ఖర్చు కోసం 80 సెంట్ల భూమిని అమ్మకానికి పెట్టాడు. అభ్యర్థులు, రాజకీయ నేతల ఒత్తిడితో వడ్డీ వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికలు అంటేనే పైసలతో పని. నామినేషన్ దాఖలు నుంచి ఓటర్లను ప్రసన్నం చేసుకోవటంతోపాటు ప్రచారానికి డబ్బు నీళ్ళలా ఖర్చు అవుతుంటాయి. పదవిపై ఆశతో నామినేషన్లు దాఖలు చేస్తున్న అభ్యర్థులు ఖర్చు ఎలా అనే ఆలోచనలో పడ్డారు.
డబ్బుల కోసం వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. అభ్యర్థుల తాకిడితో వ్యాపారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఎన్నికల ఖర్చు ఒక్కరోజుకే సరిపోతుంది. సర్పంచ్ ఎన్నికల ప్రచారం సుమారు 10 రోజులకు పైగా ఉండటంతో రోజువారీ వ్యయం భరించగలమా అనే సందిగ్ధంలో పడుతున్నారు. ఎలాగైనా గెలవాలనే కృతనిశ్చయంతో అప్పులు చేసేందుకు వెనుకాడటం లేదు. అవసరమైతే స్థిరాస్తుల తనఖా లేదా అమ్మకానికి సిద్ధమవుతున్నారు. బరిలోకి దిగాక వెనకడుగు వేయకూడదనే నిర్ణయంతో ముందుకు సాగుతున్నారు. జిల్లావ్యాప్తంగా మూడు విడతల్లో మొత్తం 471 గ్రామ పంచాయతీలు, 4,168 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వందల సంఖ్యలో ఉన్న సర్పంచ్ల కోసం రమారమీ 3 నుంచి నలుగురు చొప్పున నామినేషన్లు వేస్తున్నారు. అలాగే వేలల్లో ఉన్న వార్డులకు పోటీ తీవ్రంగానే ఉంది.
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేద్దామన్న ఉత్సాహం ఉన్నప్పటికీ కొందరు చేతిలో డబ్బుల్లేక నిరుత్సాహానికి గురవుతున్నారు. రిజర్వేషన్లు కలిసొచ్చినా కరెన్సీ లేక కళ్లు తేలేస్తున్నారు. తాజా మాజీలు పోటీకి సిద్ధమవుతున్నారు. మహిళలకు 33 శాతంకు పైగా కేటాయించటంతో భార్యలను బరిలో నిలుపుతున్నారు. గతంలో పెండింగ్లో ఉన్న బిల్లులు రాబట్టుకునేందుకు పోటీలో ఉంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళవుతున్నా నిధులు విడుదల చేయకపోవటంతో ఆగ్రహంతో ఉన్నారు. ఎలాగైనా పోటీ చేసి ప్రజలకు సేవ చేయటంతోపాటు పాత బిల్లులు తెచ్చుకోవచ్చనే అభిప్రాయంలో ఉన్నారు. పాత పరిచయాలతో తప్పని పరిస్థితుల్లో అప్పుల కోసం వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులను దీటుగా ఢీకొనాలంటే ఖర్చుకు వెనకాడకూడదు. రోజూ వారీగా కూడా ఖర్చు బాగానే అవుతోంది. క్యాడర్ను కాపాడుకోకుంటే ఆశించిన ఫలితం తారుమారవుతుందని భయపడుతున్నారు. ప్రత్యర్థులను ఢీకొనేందుకు ఒకరికొకరు దీటుగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు గ్రామాల్లో నెలకొన్నాయి. ఎంత చిన్న గ్రామమైనా ఖర్చు రూ.లక్షల్లోనే ఉంటుంది. పెద్ద పంచాయతీల్లోనైతే రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పైగానే ఖర్చు అవుతుంది. అభ్యర్థులు ఎలా నెట్టుకొస్తారో చూడాలి మరి.