వాతావరణం, జీవావరణం, పర్యావరణాల మహా సమ్మేళనమే సంక్రాంతి. అలుకు చల్లిన వాకిళ్లు; నేలను పరుచుకున్న ముగ్గులు; రేగిపళ్లు, చెరుకు గడలు, గొబ్బెమ్మలతో నిండిన రంగవల్లులు; సర్వపిండి వంటలు; ఆకాశాన్ని తాకే గాలిపటాలతో శ్రమైక జీవన సౌందర్యానికి అద్దం పట్టింది సంబురాల సంక్రాంతి. పంటలు చేతికొచ్చేప్పుడు జరుపుకునే వేడుక. శ్రమ ఫలించి గాదెలు నిండిన రోజు. సంస్కృతిలో భాగమైన పండుగ రోజు. బతుకుదెరువు రీత్యా దూర ప్రాంతాల్లో ఉన్న సొంత వాళ్లంతా సొంతూళ్లకు చేరుకునే పండుగ రోజు. మూడు రోజులూ తమ వారితో సంతోషంగా జరిగే రోజు.
ఇంతటి విశిష్టతలు, ఇన్ని ప్రత్యేకతలు ఉన్న సంక్రాంతి ప్రతి ఒక్కరికి ఆనందాలు పంచింది. మొత్తానికి ఈ మూడు రోజుల పండుగ సంబురంగా ముగిసింది. సోమవారం భోగి, మంగళవారం మకర సంక్రాంతి, బుధవారం కనుమ పండుగలను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. దీంతో పల్లెలు, పట్టణాల్లో పండుగ శోభ నెలకొన్నది. డూడూ బసవన్నలు విన్యాసాలు చేశారు. తొలిరోజు భోగినాడు జిల్లా ప్రజలు పూజలు చేశారు. తమ చిన్నారులపై భోగిపళ్లు పోసి వారిని ఆశీర్వదించారు. రెండోరోజు మకర సంక్రాంతి నాడు కొత్త అల్లుళ్లు, బంధుమిత్రులను ఆహ్వానించారు. అందరూ కలిసి ఘుమఘుమలాడే పిండివంటలను ఆరగించి సంతోషంగా గడిపారు. మూడో రోజు కనుమ నాడు మాంసాహారాలతో విందు భోజనాలు చేశారు. ఈ మూడు రోజులూ పిల్లలు, పెద్దలు తమ వారితో కలిసి తమ సొంతూళ్లలో సందడిగా, సంతోషంగా గడిపారు. పిల్లలు గాలిపటాలతో ఆనందంగా ఆటలాడుకున్నారు. పెద్దలు ఇష్టదైవాలకు మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.
-కొత్తగూడెం టౌన్/రామవరం, జనవరి 15
120 వెరైటీలతో కొత్త అల్లుడికి విందు
సంక్రాంతి సందర్భంగా వైరాలోని ఓ కుటుంబం తమ ఇంటి కొత్త అల్లుడికి 120 రకాల వెరైటీలతో విందు భోజనం ఏర్పాటుచేసి ప్రత్యేకతను చాటుకుంది. వైరా 12వ వార్డులో నివసిస్తున్న బాలాజీ జ్యూయలరీ షాపు నిర్వాహకులు నందిగామ భాస్కర్‌రావు, సుజాత దంపతులు తమ రెండో కుమార్తె మధుశ్రీకి ఇటీవల వివాహం జరిపించారు. కొత్త అల్లుడైన భద్రాద్రి జిల్లా దమ్మపేట సుదాపల్లికి చెందిన కొనకొల్ల సందీప్‌ను సంక్రాంతికి ఆహ్వానించి అతిథి మర్యాదలతో 120 రకాల స్వీట్లు, వంటకాలను నూతన దంపతులను వడ్డించి ఆనందపరిచారు.