పెనుబల్లి(కల్లూరు), ఏప్రిల్ 23 : కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రంలోని రైతులందరూ సుఖసంతోషాలతో జీవిస్తే.. రెండున్నరేళ్ల రేవంత్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా, దుర్భిక్షంగా మారిందని, వారి మెడకు ఉరితాళ్లు బిగించినట్లు అయ్యిందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కల్లూరు మండలం పుల్లయ్యబంజర ఐకేపీ సెంటర్‌ను బీఆర్ఎస్ శ్రేణులు, రైతులతో కలిసి ఆయన గురువారం సందర్శించారు. అనంతరం రైతులతో కలిసి ఐకేపీ కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ నియోజకవర్గంలో 70 శాతం పచ్చి ధాన్యాన్ని ఇప్పటికే రైతులు అమ్ముకున్నారని, మిగిలిన 30 శాతం వడ్లను కూడా ప్రభుత్వానికి కొనే ఆలోచన లేదని ధ్వజమెత్తారు.
జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే.. 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న వేశారని, కానీ, ఇప్పటివరకు ఒక్క గింజ కూడా ప్రభుత్వం కొనలేదని మండిపడ్డారు. జిల్లాలో చెప్పుకోవడానికి ముగ్గురు మంత్రులు ఉన్నా.. రైతులను రోడ్డెక్కిస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలిచి ప్రశ్నించడంతోపాటు ధర్నాలకు పిలుపునిస్తే.. హడావిడిగా రిబ్బన్లు కట్ చేసి, కొబ్బరికాయలు కొట్టడంతోనే సరిపెడుతున్నారని ఎద్దేవా చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పంట చేతికొచ్చే నెల రోజుల ముందే కొనుగోళ్లపై అధికారులతో సమీక్షలు నిర్వహించేవారని, సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేవారని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రైతు సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ బెదిరిస్తున్నారని ఆరోపించారు.
రైతులను చీడపురుగు కంటే అన్యాయంగా చూస్తున్నారని, సరైన సమయంలో యూరియా అందించరు.. అవసరమైన సమయంలో ఎన్నెస్పీ జలాలు ఇవ్వరు.. కరెంట్ సరిగా ఉండదు.. రైతుభరోసా రానివ్వరు.. బీమా లేదు.. వీటిన్నింటినీ అధిగమించి పండిన పంటను అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయరు.. ఇలాగైతే రైతులు ఎలా బతికేదని సండ్ర ప్రశ్నించారు. బోనస్ ఎగ్గొట్టేందుకే వడ్ల కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారని, కాగితాల్లో మాత్ర 9 వేల కేంద్రాలు ఏర్పాటు చేశామని పగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని, వారి కోసం ఎంతవరకైనా పోరాడుతుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కట్టా అజయ్‌బాబు, సీనియర్ నాయకుడు లక్కినేని రఘు, కౌన్సిలర్లు పెడకంటి రామకృష్ణ, ఇస్మాయిల్, మల్లేశ్వరరావు, బోబోలు లక్ష్మణరావు, మేకల కృష్ణ, రవూఫ్, కమ్లీ, ఇతిహాస్, కొరకొప్పు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.