వేంసూరు, సెప్టెంబర్11 : కల్తీ విత్తనాలు వేసి వరి పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశారు. కందుకూరుకు చెందిన రైతులు కరీంనగర్లోని ఓ కంపెనీకి చెందిన బీపీటీ-2782 రకం వరి సాగు చేయగా.. 120 రోజులకు ఈతకు రావాల్సి ఉండగా.. 90 రోజులకే 40 శాతం మేర ఈనింది. దీంతో కల్తీ విత్తనాలతో నష్టపోయిన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే సండ్ర గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్నరకం వరి సాగు చేస్తే బోనస్ వస్తుందనే ఆశతో రైతులు పంట వేస్తే కల్తీ విత్తనాలతో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. వెంటనే కల్తీ విత్తన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2782 రకం ధాన్యాన్ని వేంసూరు మండలం భరణిపాడు, మర్లపాడు, లింగపాలెం, కుంచపర్తి, చౌడవరం గ్రామాల్లో రైతులు సాగు చేశారని తెలిపారు. ఒక్క కందుకూరులోనే 1,500 ఎకరాల్లో రైతులు ఈ రకం సాగు చేసి నష్టపోయారని, వ్యవసాయాధికారులు, కంపెనీ ప్రతినిధులు పరిశీలించి కారణాలను శాస్త్రవేత్తల చేత పరిశీలన చేయించాలని కోరారు.
ఓ వైపు యూరియా దొరకక రైతులు సతమతమవుతుంటే.. మరోవైపు కల్తీ విత్తనాలు రైతులను నిండా ముంచుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపంతో రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని, గతంలో కేసీఆర్ జూన్ నెలలోనే యూరియాను స్టాక్ ఉంచేవారని గుర్తు చేశారు. కంపెనీ యజమానులు రైతులకు న్యాయం చేయాలని, లేదంటే కలెక్టర్, వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి పరిస్థితిని వివరిస్తామన్నారు. కార్యక్రమంలో కందుకూరు, దుద్దెపూడి, భరణిపాడు, మర్లపాడు, చౌడవరం గ్రామాల రైతులు, నాయకులు పాల్గొన్నారు.