సత్తుపల్లి టౌన్, ఆగస్టు 22 : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లి ఆసుపత్రిలో కొందరు వైద్యులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో శనివారం ఆయన ఆసుపత్రిని సందర్శించారు. వైద్య సేవల గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడిన అనంతరం సండ్ర విలేకరులతో మాట్లాడారు.
వంద పడకల ఆసుపత్రి భవనం అందుబాటులోకి రాకపోవడంతో వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులను కొందరు వైద్యులు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని, నిరుపేదలు, సామాన్య ప్రజలే ప్రధానంగా ఆశ్రయించే ఆసుపత్రిలో ఇలాంటి పరిస్థితులు ఉండటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల రేజర్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని పాముకాటు వేసిందని, ఆయన్ను ఆసుపత్రికి తీసుకొస్తే రెండున్నర గంటలపాటు యాంటీ స్నేక్ వీనం అందలేదనే ఆరోపణలు వచ్చాయని సండ్ర తెలిపారు. పరిస్థితి విషమించడంతో బాధితుడిని ఖమ్మం ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలన్నారు.
వైద్య వృత్తిని ప్రజలు ఎంతో పవిత్రంగా భావిస్తారని, వైద్యులను భగవంతుడితో సమానంగా గౌరవిస్తారని సండ్ర గుర్తు చేశారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండటంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్యం అందించేలా విధులు నిర్వహించాలన్నారు. ఓపీతోపాటు అన్ని విభాగాల్లో నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, నాయకులు మోరంపూడి ప్రభాకర్, మల్లూరు అంకమరాజు, చాంద్‌పాషా, ఆనందరావు, వీరమోహనరెడ్డి, భాను పాల్గొన్నారు.