భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : గోదావరి ఇసుకకు బయటకు తీసే ఇసుక సొసైటీల్లోని సభ్యుల మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరింది. ఏడేళ్లుగా ఒకే కమిటీ పెత్తనం చేస్తున్నదని, ఆదాయపు లెక్కలు, బైలా చూపించడం లేదని సమ్మక్క-సారక్క ఇసుక సొసైటీలో అత్యధిక మంది సభ్యులు బహిరంగంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. 160 మందితో ఉన్న సొసైటీ నుంచి 130 మంది బయటకు వచ్చి కొత్త సొసైటీని ఏర్పాటు చేశారు.
సంబంధిత అధికారులు కూడా నిబంధనల ప్రకారం వ్యవహరించడం లేదని, పాత సొసైటీకే ఒత్తాసు పలుకుతున్నారని మండిపడుతున్నారు. అన్ని అర్హతలున్న తమ సంఘానికెందుకు సొసైటీని అప్పగించడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. పాత కమిటీపై విచారణ చేపట్టాలని, తాము ఎన్నుకున్న కొత్త కమిటీకి సొసైటీ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల మెజారిటీ సభ్యులు కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఇదేకాక మణుగూరు మండలంలో మూడు సొసైటీల రచ్చ మరింత వివాదాలకు దారితీస్తున్నది.
మణుగూరు మండలం చినరాయిగూడెంలోని గోదావరి ఇసుక ర్యాంపును ఇసుక లేబర్ సొసైటీ పేరుతో స్థానిక స్వయం సహాయక సంఘాల్లోని గిరిజన మహిళలు నిర్వహిస్తున్నారు. ఇసుక రవాణా విషయాలు, ఖర్చులు, లెక్కలు వంటి విషయాలను సొసైటీలోని కీలకమైన పదవుల్లో ఉన్న బాధ్యులు.. సహచర సభ్యులకు చెప్పకపోవడంతో వారి మధ్య వివాదం బయటికొచ్చింది. చిలికిచిలికి గాలివానగా మారి సంబంధిత అధికారుల వద్దకు చేరింది. వారు కూడా పట్టించుకోకపోవడం, సొసైటీలోని ముఖ్యులకు ఒత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు రావడం వంటి కారణాలతో అత్యధిక మంది సభ్యులు కలెక్టరేట్ వద్ద ఇటీవల నిరసనకు దిగారు.
మణుగూరు మండలంలో అత్యధికంగా మూడు ర్యాంపుల ద్వారా గోదావరి నుంచి ఇసుక తోలకాలు నడుస్తున్నాయి. అవి ఈ నాటివి కావు.. దాదాపు పదేళ్ల నుంచి అక్కడ గిరిజన సొసైటీ ద్వారా ఇసుక లావాదేవీలు నడుస్తున్నాయి. ఇసుకకు డిమాండ్ ఉండడం.. బినామీ కాంట్రాక్టర్ల పెత్తనం పెరగడంతో కాంట్రాక్టర్లు సొసైటీల మధ్య చిచ్చుపెడుతున్నారు. దీంతో మూడు సొసైటీల సభ్యుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితికి వచ్చేశారు. చినరాయిగూడెం, కొండాపురం, పద్మగూడెం, కొమ్ముగూడెం ర్యాంపుల పరిధిలో సొసైటీల సభ్యులు రోజుకొకరు బయటకు వచ్చి ప్రెస్మీట్లు పెట్టి ఆందోళనలు చేస్తున్నారు. సమ్మక్క-సారక్క, నాగులమ్మ, పెద్దమ్మతల్లి సొసైటీల మధ్య వివాదం ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది. దీనిపై ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో చిలికిచిలికి గాలివానలా తయారవుతున్నది.
చినరాయిగూడెం ఇసుక ర్యాంపును 2017లో అప్పటి అధికారులు ‘సమ్మక్క-సారక్క ఇసుక లేబర్ సొసైటీ’కి అప్పగించారు. అప్పటి సభ్యులు వెంకటరమణను సొసైటీ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. కీలకమైన పదవుల్లో కొందరిని, సభ్యులుగా మరికొందరిని ఎన్నుకున్నారు. అందరూ కలిసి ఈ ర్యాంపు ద్వారా ఇసుకను విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. లెక్కలు ఎందుకు చెప్పడం లేదని, బైలా ఎందుకు చూపించడం లేదని సొసైటీ ముఖ్య బాధ్యులను ఇతర సభ్యులు నిలదీశారు. వారు స్పందించకపోవడంతో సంఘంలోని అధిక సంఖ్యలో ఉన్న సభ్యులు అదే పేరుతో(సమ్మక్కసారక్క ఇసుక లేబర్ సొసైటీ) కొత్త కమిటీని ఎన్నుకున్నారు. తమ కమిటీలో అత్యధిక మంది సభ్యులున్నందున సొసైటీ బాధ్యతను, ఇసుక ర్యాంపు తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పాత కమిటీలోని ముఖ్యులు.. సొసైటీ నిబంధనలు పాటించడం లేదని అధికారులకు ఫిర్యాదు చేశారు.
సమ్మక్క-సారక్క ఇసుక సొసైటీ సభ్యులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం. సభ్యుల్లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు.
– ఖుర్షీద్, డీసీవో, భద్రాద్రి కొత్తగూడెం
సొసైటీ నిబంధనల ప్రకారం రెండేళ్లకోసారి కొత్త కమిటీని ఎన్నుకోవాలి. మహాజన సభ తీర్మానం ద్వారా కమిటీని ఎన్నుకునే అవకాశం సభ్యులకు ఉంది. అలాగే మేమూ కొత్త కమిటీని ఎన్నుకున్నాం. కానీ.. అధికారులు మాకు ర్యాంపు నిర్వహణ బాధ్యతను అప్పగించలేదు.
– సోంది నర్సమ్మ, సొసైటీ ఉపాధ్యక్షురాలు, చినరాయిగూడెం
కొత్తగా ఎన్నుకున్న మా సొసైటీలో 130 మంది సభ్యులం ఉన్నాం. పాత సొసైటీలో 30 మందే ఉన్నారు. నిబంధనల ప్రకారమే కొత్త కమిటీ ఎన్నుకున్నాం. పాత కమిటీ వ్యవహారాలపై విచారణ చేయాలని కోరితే అధికారులెవరూ స్పందించడం లేదు.
– కుంజా ఆదిలక్ష్మి, సొసైటీ సభ్యురాలు, చినరాయిగూడెం
పాత సొసైటీపై విచారణ చేయాలని కోరుతూ ఏడాదికాలంగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. పాత కమిటీ బాధ్యులు ఆదాయ వివరాలు చెప్పడం లేదు. తప్పుడు లెక్కలతో ఇసుక ర్యాంపు నడిపిస్తున్నారు. బైలా కూడా చూపించడం లేదు.
– తెల్లం నాగమణి, సొసైటీ కార్యదర్శి, చినరాయిగూడెం