భద్రాచలం, జూన్ 27 : రాష్ట్రంలో రెవెన్యూశాఖ మంత్రి ఆదాయం గణనీయంగా పెరుగుతుంటే రాష్ట్ర ఆదాయం మాత్రం తగ్గుతోందని, ప్రజాసంక్షేమ వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి మరో పోరాటానికి సిద్ధం కావాలని బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. భద్రాచలంలో శనివారం జరిగిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలోని కీలకమైన సీతమ్మసాగర్, సీతారామ ప్రాజెక్టులను మూలనపడేశారని, భద్రాచలం ఏజెన్సీలో గిరిజన సొసైటీల ముసుగులో ఇసుక దోపిడీ జరుగుతోందన్నారు. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఎటువంటి అభివృద్ధి లేకపోయినా, ఇసుక లారీల ద్వారా ఎమ్మెల్యేకు మాత్రం ఆదాయం వస్తోందన్నారు. భద్రాచలం, పినపాకలో ఇసుక తుపాన్ నడుస్తోందని, ఇందులో గిరిజనేతరులు కీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు.
గోదావరి ముంపు గురించి ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని, కనీసం సమీక్ష కూడా చేయలేదన్నారు. మాయమాటలతో, అమలుగాని హామీలతో గద్దెనెకిన కాంగ్రెస్ ప్రభుత్వం సగం పాలన కూడా పూర్తికాక విఫలమైందన్నారు. సీఎం రేవంత్ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు కప్పం కట్టే సీఎంమేనని, ఆయన ప్రజలకు జవాబుదారీ కాదని విమర్శించారు. తన పదవిని కాపాడుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాడు తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదని విమర్శించారు. పొరపాటున రేవంత్‌రెడ్డిని గద్దెనెకించామని, కేసీఆర్ సారే మళ్లీ వస్తే మా బతుకులు మారతాయంటూ పేదలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సంకేతాలు వెలువడుతున్నాయని, రానున్నది మళ్లీ గులాబీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరికలు
దుమ్ముగూడెం మండలం పెద్దనల్లబెల్లి గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు పూసం దాసు శనివారం మాజీ మంత్రి పువ్వాడ, ఎమ్మెల్సీలు తకెళ్లపల్లి, తాతా మధు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇచ్చిన వాగ్దానాలు అమలుచేయని కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, స్థానిక నాయకుల పనితీరు నచ్చక బీఆర్ఎస్లో చేరుతున్నట్లు దాసు తెలిపారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి మళ్లీ జరగాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ, కణితి రాముడు, రేసు లక్ష్మి, కామేశ్వరరావు, కృష్ణ, భూపతిరావు, నిరీక్షణరావు పాల్గొన్నారు.
భద్రాచలం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్సీ, ఖమ్మం ఉమ్మడిజిల్లా బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్చార్జి తకెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. ప్రభుత్వం నిర్వహించే సర్ ప్రోగ్రాంను పరిశీలిస్తూ ఓటు నమోదు సరళిపై అవగాహన కలిగి, బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. బూత్ లెవల్ ఏజెంట్లు కూడా పార్టీ సూచనలు పాటించాలని, పార్టీ పునర్నిర్మాణం జరుగుతోందని, ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందన్నారు. త్వరలోనే అన్నిరకాల కమిటీలు వేస్తామని, కష్టపడేవారికి తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు.
– ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్రావు
భద్రాచలంలో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు ‘జిత్తులమారి నక్క’ అని నియోజకవర్గ ప్రజలందరికీ అర్థమైందని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. ప్రజల గుండెల మీద దెబ్బకొట్టిన ‘తెల్లం’ను ఆ భద్రాద్రి రాముడు క్షమించడన్నారు. బీఆర్ఎస్ అంటే భద్రాచలం అడ్డా అని కార్యకర్తలు మరోసారి నిరూపించే సమయం ఆసన్నమైందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి రావులపల్లి రాంప్రసాద్, నాయకులు మానే రామకృష్ణ, నరసింహమూర్తి, బుచ్చయ్య, రేసు లక్ష్మి, రాంబాబు, రామకృష్ణారెడ్డి, తాతారావు, రాముడు, పృథ్వీ, సునీల్‌కుమార్, ప్రమోద్‌కుమార్, పూర్ణచంద్రరావు, పవన్‌కుమార్, గోపి, లక్ష్మీనారాయణ, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
– ఎమ్మెల్సీ తాతా మధు