ఖమ్మం జిల్లాలో వరదల ధాటికి పంట పొలాల్లో ఇసుక మేటలు వేసింది. రహదారులన్నీ అస్తవ్యస్తంగా మారాయి. కొన్నిచోట్ల బ్రిడ్జిలు సైతం కొట్టుకుపోయాయి. ఇండ్లు దెబ్బతిన్నాయి. మొత్తానికి వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి.
ఈ నేపథ్యంలో మంగళవారం ఆయా ముంపుప్రాంతాల్లో వివిధ పార్టీల నేతలు పర్యటించి బాధితులను ఓదార్చారు. పలుచోట్ల బీఆర్ఎస్ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు సైతం సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంరూరల్, తిరుమలాయపాలెం మండలాల్లో పర్యటించారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి ఖమ్మంరూరల్, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మధిర మండలాల్లో పర్యటించి వరద బాధితులకు భరోసా కల్పించారు.
– నమస్తే నెట్వర్క్
గణేష్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి : కమిషనర్ సునీల్‌దత్
మామిళ్లగూడెం, సెప్టెంబర్ 3: జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా నిర్వాహకులు విగ్రహ ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పని సరిగా తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ఫ్రొటోకాల్ వెబ్ సైట్ https;//policeportal.tspolice. gov.in ద్వారా నిర్వాహకులు పూర్తి వివరాలు నమోదు చేసుకుని రిజిస్టేషన్ చేసుకోవాలన్నారు. దరఖాస్తులు చేసుకున్న తరువాత పోలీస్‌స్టేషన్ నుంచి అధికారులు ఆన్లైన్ ద్వారా అనుమతులు జారీ చేస్తారని తెలిపారు.
వేగంగా విద్యుత్ పునరుద్ధరణ పనులు : ఎస్ఈ
మామిళ్లగూడెం, సెప్టెంబర్ 3: వరద ముంపు ప్రాంతాల్లో దెబ్బతిన్న విద్యుత్ లైన్ల మరమ్మతు పనులను వేగంగా నిర్వహిస్తున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ ఎస్ఈ సురేందర్ తెలిపారు. ప్రజలకు వెంటనే విద్యుత్ సరఫరాను అందించేందకు సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు.
సాప్ట్వేర్ ఉద్యోగాలకు ఎస్బీఐటీ విద్యార్థులు
ఖమ్మం ఎడ్యుకేషన్, సెప్టెంబర్ 3: నగరంలోని ఎస్బీఐటీ కళాశాలకు చెందిన 13 మంది విద్యార్థులు సాప్ట్వేర్ ఉద్యోగాలు సాధించారని కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. మంగళవారం కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో 13మంది ఉద్యోగాలు దక్కించకున్నారని పేర్కొన్నారు. విద్యార్థులను కరస్పాండెంట్ డాక్టర్ ధాత్రి, ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్, అకడమిక్ డైరెక్టర్స్, అధ్యాపకులు అభినందించారు.
నేటి నుంచి దోస్త్ స్పెషల్ డ్రైవ్ ప్రవేశాలు
ఖమ్మం ఎడ్యుకేషన్, సెప్టెంబర్ 3: డిగ్రీలో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు బుధవారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జాకీరుల్లా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వరద బాధితులకు ఆహారం, నిత్యావసరాలు పంపిణీ
ఖమ్మం ఎడ్యుకేషన్, సెప్టెంబర్ 3: ఖమ్మం నగరంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కుటుంబాలకు చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో 200మందికి రూ.వెయ్యి విలువ చేస్తే నిత్యావసర వస్తువులు అందించారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం సెంట్రల్ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ చేశారు. పలు పాఠశాలల ఆధ్వర్యంలో అన్నదానం, దుస్తుల పంపిణీ చేశారు.
చదువు సాగేది ఎలా…
ఖమ్మం ఎడ్యుకేషన్, సెప్టెంబర్ 3: మున్నేరు వరదలకు నయాబజార్ కళాశాల కళావిహీనంగా మారింది. కళాశాల గ్రౌండ్ ప్లోర్లో తరగతి గదులు, స్టాప్ రూమ్, ఆఫీస్ రూమ్, లైబ్రరీ, వృత్తి విద్య ప్రయోగశాలలు, ల్రైబరీ పుస్తకాలు తడిసిపోయాయి. బుధవారం తరగతులు ప్రారంభమవుతున్నా చదువు సాగే పరిస్థితులు కనబడని స్థితి నెలకొంది.
బాధితులకు కార్పొరేటర్ తోట ఆధ్వర్యంలో అన్నదానం
ఖమ్మం, సెఫ్టెంబర్ 3: 33వ డివిజన్ కార్పొరేటర్ తోట ఉమారాణి వీరభద్రం ఆధ్వర్యంలో నగరంలోని 30, 35 డివిజన్లోని వరద బాధితులకు భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తోట వీరభద్రం మాట్లాడుతూ.. కష్టం వచ్చిన వారికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
రిటర్నింగ్‌వాల్ ఇచ్చింది కేసీఆర్.. తెచ్చింది కందాళ
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 3: మున్నేరుకు రిటర్నింగ్ వాల్ ఇచ్చింది కేసీఆర్ అని, ఇచ్చారని. అనుమతులు, నిధులు తీసుకొచ్చింది మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అని బీఆర్ఎస్ మండల శాఖ మంగళవారం ఒక ప్రనటనలో తెలిపింది. సోమవారం మండలంలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి 650 కోట్లతో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని చెప్పడం పట్ల వారు ఆక్షేపణ వ్యక్తం చేశారు. అప్పటి పాలేరు ఎమ్మెల్యే కందాల ముంపు ప్రాంతాల వాసుల ఇబ్బందులను నాటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతోనే తక్షణం రూ.690.52 కోట్ల నిధులను కేటాయించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాలపై ప్రజలు ఆలోచన చేయాలని బీఆర్ఎస్ నాయకులు ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
పంటల పరిశీలన
రఘునాథపాలెం, సెప్టెంబర్ 3 : మున్నేరు వరద ఉధృతికి దాని పరీవాహకంలోని ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలం రామన్నపేట ప్రాంతంలో కొట్టుకుపోయిన పంటలను ఖమ్మం డీఏవో పుల్లయ్య పరిశీలించారు. వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి సోమవారం క్షేత్రస్థాయికి వెళ్లిన ఆయన.. దెబ్బతిన్న పంటలను పరిశీంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామన్నపేట రైతువేదికలో నిర్వహిస్తున్న రుణమాఫీ కుటుంబ నిర్ధారణ కార్యక్రమాన్ని పరిశీలించారు.