వ్యవసాయ ఆధారిత జిల్లా. జలాశయాలు, రిజర్వాయర్లు, చెరువులు, బావులు, సాగర్ ఆయకట్టు కింద ఏటా రెండు పంటలు పండించుకునే రైతులు. సాగుకే ప్రథమ ప్రాధాన్యమిచ్చే ఈ రైతులను 25 రోజుల క్రితం భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. నిండా ముంచాయి. రెండు పంటలు పండించుకునే భూములను పనికి రాకుండా చేశాయి. ఇసుక మేటలు, మట్టి దిబ్బలు, రాళ్లురప్పలతో నింపాయి. వాటిని మళ్లీ సాగుకు అనుకూలంగా మలచుకోవాలంటే రైతుల తరంకాని పరిస్థితి.
ఖమ్మం, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జిల్లాలో వర్షాలు, వరదలు తగ్గి దాదాపు 20 రోజులు దాటింది. అయినా పంటలు కోల్పోయి, భూములు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారమూ అందలేదు. పైగా సర్వేల పేరుతో పక్షం రోజులపాటు అధికారులు కాలయాపన చేశారు. ఇంతవరకు బాధిత రైతులకు ఎలాంటి న్యాయం జరగకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఎకరానికి రూ.10 వేల చొప్పున రైతులకు వరద సాయం అందిస్తామని ఒకసారి, పంట భూముల్లో ఇసుక మేటలు వేసిన రైతులకు మరింత సాయం అందిస్తామని మరోసారి చెప్పారు జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు. వారు అలా పలుమార్లు నొక్కి చెప్పినా కాసులు మాత్రం కర్షకుల ఖాతాల్లో పడలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మాటలకు ఎంత విలువ ఉందో అర్థమవుతోంది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు క్యాబినెట్లో ఉన్నా.. పరిహారం కోసం పైసా విదల్చలేదంటూ రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు.
ముఖ్యంగా మున్నేరు, ఆకేరు వాగు పరీవాహక ప్రాంతాల్లోని వందలాది ఎకరాల సాగు భూముల్లో భారీ వర్షాలు, వరదలతో ఇసుక మేటలు వేసిన విషయం విదితమే. వీటిని తొలగించడం రైతుల వల్ల కావడం లేదు. ఖర్చులు భరించలేక, పరిహారం ఇంకా అందక.. భారాన్ని మోస్తున్న రైతులు.. మేటలతో ఉన్న భూములను చూసి పుట్టెడు దుఃఖంలో మునిగిపోతున్నారు. ఈ నెల ఒకటో తేదీ వచ్చిన భారీ వర్షాలు, వరదలతో ఖమ్మం జిల్లావ్యాప్తంగా 27 వేల మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా రైతులకు సంబంధించి 27 వేల ఎకరాల్లో పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకు పోయాయని వ్యవసాయ శాఖ అధికారులు తేల్చారు. నివేదికను ప్రభుత్వానికి పంపించారు. సర్వే చేసే క్రమంలో నష్టం అంచనాల్లో సైతం భారీగా కోతలు విధించినట్లు తెలుస్తోంది. 79 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగే అవకాశం ఉందని వరదలు తగ్గిన రెండు రోజుల్లోనే వ్యవసాయ శాఖ ప్రకటించింది. కేవలం 27 వేల ఎకరాల్లోనే పంట నష్టం జరిగినట్లు మరో పదిరోజుల తరువాత వెల్లడించింది. అయితే ఈ జాబితా వెల్లడైతేనే అందులో పేర్లు లేని రైతుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే, పంట విలువ పూర్తిగా అంచనా వేసి అందుకు తగిన పరిహారం అందిస్తేనే బాధిత రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది.
అయితే పొలాల్లో పోగుపడ్డ ఇసుక మేటలు, మట్టి దిబ్బలు, రాళ్ల కుప్పలను తొలగించాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న పని. ఒక్కో ఎకరానికి రూ.లక్ష చొప్పున ఖర్చయ్యే అవకాశం ఉంటుందని పలువురు రైతులు చెబుతున్నారు. వరి పొలాల్లో ఇసుక మేటలను తొలగించడంతోపాటు తిరిగి దుగాలు వేసుకోవాల్సి ఉంటుంది. సాగు భూముల నుంచి తొలగించిన మట్టి దిబ్బలు, ఇసుక మేటలను ట్రాక్టర్ల సాయంతో ఇతర ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. ఇదంతా సన్న, చిన్నకారు రైతులకు విషమ పరీక్షగా ఉంది. ఇక, నిరుటి యాసంగిలో సాగర్ నీరు రాకపోవడంతో ఆయకట్టు పొలాలు పూర్తిగా ఎండిపోయిన విషయం విదితమే. ఈ ఏడాది వానకాలంలో వచ్చిన భారీ వరదలు.. సాగు భూములను పనికి రాకుండా చేశాయి. ఈ క్రమంలో సర్కారు సాయం కోసం ఎదురుచూసిన రైతులకు నిరాశే మిగులుతోంది. సాయం ఎంతకూ రాకపోవడంతో కొందరు వడ్డీలకు తెచ్చి మరీ పొలాల్లోని మేటలు తొలగించుకుంటున్నారు. రాబోయే సీజన్లోనైనా పొలాన్ని రూపునకు తీసుకొస్తే వచ్చే రెండు మూడేళ్ల తరువాతైనా తిరిగి మాగాణిగా మారుతుందనే ఆశతో రైతులు దెబ్బతిన్న భూములను బాగు చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా.. కనీసం బాధిత రైతులను కలిసి ‘మేమున్నాం..’ అనే భరోసా ఇచ్చే పాలకులు జిల్లాలో కరువవడం గమనార్హం.
నాకు పావు తక్కువ రెండెకరాల భూమి ఉంది. నీరు లేకపోవడంతో ఒక్క గింజ కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. పెట్టుబడితోపాటు ఇప్పటికే రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేశాను. ఏం చేయాలో తోచడం లేదు. కలెక్టర్ కూడా నా పొలాన్ని చూశారు. మా గ్రామంలో వరదకు ఇసుక మేటలు వేశాయి. నీరు లేక పొలాలు ఎండిపోయిన నా లాంటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
-పడిశాల మైసయ్య, రైతు, జుఝల్రావుపేట, కూసుమంచి
నాకు సాగర్ నీరు తప్ప మరో మార్గం లేదు. కాల్వకు గండిపడిన 20 రోజుల సంది నీరు రాకపోవడంతో పొలం మొత్తం ఎండిపోయింది. నాకు ఇది తప్ప ఆదెరువు లేదు. నీరు ఇప్పుడు ఇచ్చినా నా పొలం పండదు. నాకున్న రెండెకరాల్లో వరి గడ్డి మాత్రమే మిగిలింది. ఇప్పటికే భూమి అంతా నెర్రెలు బారింది. ఏం చేయాలో తోచడం లేదు. మమ్మల్ని సర్కారు ఆదుకోవాలి.
-దాట్ల ముత్తయ్య, రైతు, మల్లాయిగూడెం, కూసుమంచి
వారం రోజులుగా సాగర్ నీళ్లు లేకపోవడంతో పొలం పూర్తిగా ఎండిపోయింది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి పంటను చూశారు. మొన్నటి వర్షాలతో ఇసుక మేటలు వేసిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తండా పరిధిలో ఇసుక మేట వేసిన పొలాలు 20 ఎకరాల వరకు ఉన్నాయి. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. పంట నష్టంతోపాటు ఇసుక మేట తొలగించడానికి ప్రత్యేంగా నిధులు కేటాయించాలి.
-నరేశ్, రైతు, హట్యాతండా, కూసుమంచి
ప్రస్తుతం చేతికొచ్చిన పంటలు కళ్ల ముందే ఎండిపోతున్నాయి. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. గత వారంరోజులుగా రేపోమాపో నీళ్లు విడుదల చేస్తామని పేపర్లలో చూస్తున్నాం. ప్రతిరోజూ ఇదే కొనసాగుతుంది తప్ప పంటకు నీరు రావడం లేదు. ఇలా అయితే పెట్టిన పెట్టుబడులు కూడా రావు. తీవ్ర ఆందోళన చెందుతున్నాం.
– ఎర్రా కృష్ణ, రైతు, తుమ్మలపల్లి, కొణిజర్ల
జిల్లాలో వానకాలం సీజన్ సాగు: 4,10,000 ఎకరాలు
ప్రాథమిక అంచనా ప్రకారం నష్టం: 79,000 ఎకరాలు
క్షేత్ర పరిశీలన తర్వాత పంట నష్టం: 27,908 ఎకరాలు
మొత్తం నష్టపోయిన రైతులు: 27,219 మంది