‘ముత్యాలమ్మ తల్లీ.. బోనం మీకు సమర్పిస్తాం.. ఆరోగ్యాన్ని మాకు ఇవ్వు..’ అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. శ్రావణమాసం రెండో ఆదివారం కావడంతో తెలంగాణ సంస్కృతిని చాటేలా ఉమ్మడి జిల్లాలోని అనేక గ్రామాల్లో భక్తులు అమ్మవార్లకు ప్రత్యేక బోనాలు సమర్పించారు. దీంతో వాడవాడల బోనాల పండుగ వేడుకలు అంబరాన్నంటాయి. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలతో ఆధ్యాత్మికత ఉట్టిపడింది. డీజేలు, ఆటపాటలతో బోనాల జాతర కొనసాగింది.
కల్లు కావడులు, యాటపోతులు, కోళ్లు, నైవేద్యాలతో భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామాల్లో కుటుంబాలన్నీ బంధుమిత్రులతో జనసందోహంతో కన్పించాయి. ప్రధానంగా ఖమ్మం రూరల్, ఖమ్మం చర్చీకాంపౌండ్, సారథీనగర్, వడ్డెరకాలనీ, కారేపల్లి వెంకటసాయి నగర్లలోని ముత్యాలమ్మ తల్లి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
-ఖమ్మం/ ఖమ్మం రూరల్/ కారేపల్లి/ రామవరం/ పాల్వంచ/ సత్తుపల్లి టౌన్, ఆగస్టు 18