‘రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతలకు ప్రాధాన్యం ఇస్తున్నది.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను ప్రోత్సహిస్తున్నది.. నేరాలు, సైబర్ క్రైమ్స్ నివారణకు పోలీస్‌శాఖ అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నది.. మహిళల భద్రతకు భరోసా, షీ టీమ్స్ నడిపిస్తున్నది.. అసాంఘిక, అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నది..’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఖమ్మం నగరంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్షా దినోత్సవ ర్యాలీలో ఆయన మాట్లాడారు. 2014 తర్వాత పోలీస్‌శాఖలో సమూల మార్పులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, జడ్పీ చైర్మన్ లింగాల, కలెక్టర్ వీపీ గౌతమ్,పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ పాల్గొన్నారు.
మామిళ్లగూడెం, జూన్ 4: రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతలకు ప్రాధాన్యం ఇస్తున్నదని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను ప్రోత్సహిస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఖమ్మం నగరంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్షా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. నేరాలు, సైబర్ క్రైమ్స్ నివారణకు పోలీస్‌శాఖ అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నదన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఖమ్మం పోలీస్ శాఖ రాష్ట్రంలోనే ముందంజలో ఉందన్నారు. అసాంఘిక, అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నదన్నారు. శాంతి భద్రతల విషయంలో ఖమ్మం కమిషనరేట్ అద్భుతంగా పని చేస్తోందని, కమిషనరేట్ ఏర్పాటు వల్లే నేరాలు తగ్గుముఖం పట్టాయని అన్నారు.
నేడు దేశంలోనే తెలంగాణ అత్యంత భద్రత గల రాష్ట్రమని, రాష్ట్ర రాజధానిలో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణకు మరో మణిహారమని అన్నారు. ప్రపంచ స్థాయి ప్రముఖ అద్భుత కట్టడాల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుందని అన్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పోలీస్ శాఖ ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. స్నేహపూర్వక పోలీసింగ్‌ను అమలు చేస్తున్నదన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలకు నిస్వార్థమైన సేవలను అందించడంలో ఖమ్మం పోలీసు శాఖ ముందున్నదని అన్నారు.
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ శాఖపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో స్టేషన్ల రూపురేఖలే మారిపోయాయని, ఖమ్మం పోలీస్ కేరాఫ్ ఫ్రెండ్లీ పోలీస్‌కు చిరునామాగా నిలిచిందని అన్నారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ సర్కార్ పోలీస్‌శాఖలో అనేక సంస్కరణలను తీసుకొచ్చిందన్నారు. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో ఎంత నమ్మకం పెరిగిందో అనే విషయం ఈ ర్యాలీకి వచ్చిన స్పందన చూస్తుంటే అర్థమవుతోందని అన్నారు.
Khammam2
ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్‌శాఖ ముందున్నదన్నారు. పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ.. నేర నియంత్రణ కోసం జిల్లావ్యాప్తంగా 8,477 సీసీ కెమోరాలు ఏర్పాటు చేశామన్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జడ్పీ లింగాల కమల్‌రాజు, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ విజయ్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, శిక్షణ కలెక్టర్లు రాధికా గుప్తా, మయాంక్ సింగ్, డీఎఫ్‌వో సిద్ధార్థ విక్రమ్‌సింగ్, అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, అదనపు డీసీపీ సుభాశ్‌చంద్రబోస్, ట్రైనీ ఐపీఎస్ అభినాశ్కుమార్, ఏసీపీలు రామోజీ రమేశ్, గణేశ్, ప్రసన్నకుమార్, వెంకటేశ్వర్లు, వెంకటస్వామి, రవి పాల్గొన్నారు.
ఖమ్మంలో భారీ ర్యాలీ..
సురక్షా దినోత్సవంలో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన పోలీసు వాహనాల భారీ ర్యాలీని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కాలేజీ వద్ద మంత్రి అజయ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రారంభమైన ర్యాలీ.. ఇల్లెందు క్రాస్‌రోడ్డు, ఐటీ హబ్, జిల్లా కోర్టు, ఇందిరానగర్ సరిల్, చెన్నై షాపింగ్‌మాల్, జడ్పీ సెంటర్, చర్చీ కాంపౌండ్, శ్రీనివాస్‌నగర్, ప్రకాశ్‌నగర్, పోలీస్ కమాండ్ కంట్రోల్, బోస్ బొమ్మ సెంటర్, గ్రెయిన్ మారెట్, గాంధీచౌక్, కాల్వొడ్డు, జూబ్లీ క్లబ్, మయూరిసెంటర్ మీదుగా పాత బస్టాండ్ వరకు చేరుకుంది.