మధిర, ఏప్రిల్ 19 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేయూత అందించడం అభినందనీయమని మధిర మండల ఎంఈఓ వై.ప్రభాకర్ అన్నారు. సేఫ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు పోతుకూచి కళ్యాణ చక్రవర్తి మధిర మండలంలోని మాటూరు ఉన్నత పాఠశాలకు రూ.75 వేల విలువైన షూస్, ఫర్నిచర్ వితరణగా ఇవ్వగా శనివారం ఎంఈఓ పాఠశాలకు, విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. గడిచిన 10 సంవత్సరాల నుండి సేఫ్ హాండ్స్ ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతిభ గల నిరుపేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తున్నట్లు చెప్పారు.
పాఠశాలకు కావాల్సిన భౌతిక వనరులను హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూనే మారుమూల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేయూతనందిస్తున్నట్లు తెలిపారు. నాలుగు సంవత్సరాల కాలంలో రూ.4 లక్షల విలువైన సామగ్రి అందించిన సేఫ్ హాండ్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు పోతుకూచి కళ్యాణ చక్రవర్తి, సౌమ్య దంపతులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం చెరుకుపల్లి శ్రీహరి, ఉపాధ్యాయులు మేడేపల్లి శ్రీనివాసరావు, దీవి సాయి, కృష్ణమాచార్యులు, సంక్రాంతి శ్రీనివాసరావు ,కొలగాని ప్రసాదరావు, చౌడవరపు సునీత, రెంటపల్లి భాగ్య శ్రీనివాసరావు, షేక్ ఇబ్రహీం, బొగ్గుల శ్రీనివాస్‌రెడ్డి, లావుడ్య రవికుమార్, ప్రసాద్, ఇస్సాక్ పాల్గొన్నారు.
Madhira : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ‘సేఫ్ హ్యాండ్స్’ చేయూత అభినందనీయం : ఎంఈఓ ప్రభాకర్