కనీసం తాగడానికి నీరు లేదు.. గుక్కెడు నీటి కోసం గంటలకొద్దీ నిరీక్షణ.. ఎండిపోయిన బోర్లు, బావులు, అద్దెబండ్లతో నీటి తోలకాలు, అర్ధరాత్రి సైతం మంచినీటి కోసం నానాతంటాలు.. బిందెలు తీసుకొని కిలోమీటర్ల కొద్దీ వెళ్లి నీళ్లు తెచ్చుకోవడం.. చేతిపంపుల వద్ద బారులు తీరిన బిందెలు.. ఇవన్నీ ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఎక్కడచూసినా కనిపించిన దృశ్యాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రజలకు తాగునీటి కష్టాలు శాశ్వతంగా దూరమయ్యాయి.
ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు అందుతున్నది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి ‘మిషన్ భగీరథ’ పేరుతో ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేసి శుద్ధిచేసిన జలాలను సరఫరా చేశారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ నుంచి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలోని 700 గ్రామాల్లో మండు వేసవిలోనూ మంచినీరు అందుతుండడంతో 7,00,000 మంది ప్రజలు సంతోషంగా ఉన్నారు. తమ తాగునీటి కష్టాలు తీర్చిన మాజీ సీఎం కేసీఆర్ను అపర భగీరథుడిగా కొనియాడుతున్నారు. పాలేరు మిషన్ భగీరథపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
-కూసుమంచి, మే 20
పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా వేసవి వచ్చిందంటే చాలు ప్రజలు తాగునీటికి చాలా ఇబ్బందిపడేవారు. ఫ్లోరైడ్ నీరు తాగి ఎంతోమంది రోగాల బారినపడిన ప్రజలూ ఉన్నారు. గతం తలుచుకుంటే ఎన్నో బాధలు, గాధలు.. వాటన్నింటికి కారణమైన తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది ‘మిషన్ భగీరథ’. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం ప్రజల పాలిట వరంలా మారింది.
ప్రతి ఇంటికీ నల్లా బిగించి శుద్ధిచేసిన తాగునీటిని అందిస్తుండడంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. పాలేరు రిజర్వాయర్ నుంచి 300పైగా గ్రామాల్లో 1,050 మంచినీటి ట్యాంకులకు మంచినీరు సరఫరా చేస్తున్నారు. పాలేరు నియోజకవర్గంతోపాటు ఖమ్మం కార్పొరేషన్లోని 375 ఆవాస ప్రాంతాల్లో ఇంటింటికీ నల్లాలు బిగించారు. పాలేరు నుంచి జీళ్లచెరువు వరకు పైపులైన్ ద్వారా పంపించిన నీటిని అక్కడ శుద్ధిచేసి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, సూర్యాపేట జిల్లాల్లోని మొత్తం 700 గ్రామాలకు పైగా పాలేరు రిజర్వాయర్ నుంచి తాగునీటిని అందిస్తున్నారు. సుమారు 7లక్షల మందికి పాలేరు నుంచి తాగునీటిని అందిస్తున్నారు.
మాదిరిపురం డబ్ల్యూటీపీ ద్వారా..
ఉమ్మడి వరంగల్ జిల్లాకు తాగునీరు అందిస్తున్న మాదిరిపురం డబ్ల్యూటీపీ(వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్) ద్వారా సుమారు 300 గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నారు. పాలేరు నుంచి పైపులైన్ ద్వారా మాదిరిపురం వరకు నీటిని పంపి అక్కడ శుద్ధి చేసి గుట్టపైన ఏర్పాటు చేసిన ట్యాంక్ ద్వారా తిరుమలాయపాలెం, పాత వరంగల్ జిల్లాకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. మాదిరిపురం నుంచి తిరుమలాయపాలెం మండలంలోని అన్ని గ్రామాలకు సైతం తాగునీటిని అందిస్తున్నారు.
జీళ్లచెరువు డబ్ల్యూటీపీ సక్సెస్..
జీళ్లచెరువు గ్రామంలో నిర్మించిన డబ్ల్యూటీపీ విజయవంతంగా పనిచేస్తున్నది. నేలకొండపల్లి మండలంలో 75 మంచినీటి ట్యాంకులు, కూసుమంచిలో 79, ఖమ్మంరూరల్లో 76 ట్యాంకులకు పాలేరు మిషన్ భగీరథ ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. నేలకొండపల్లి భైరవునిపల్లి వరకు, తిరుమలాయపాలెం మండలం గూడూరుపాడు వరకు నీటిని పంపిస్తున్నారు. జీళ్లచెరువులో డబ్ల్యూటీపీ వద్ద 180 కిలోవాట్ల సామర్థ్యం గల 240 హెచ్పీ మోటర్లు ఏర్పాటు చేశారు.
నిరంతర పర్యవేక్షణ..
ప్రతిరోజూ నీటిని శుద్ధి చేసి ల్యాబ్లో పరిశీలించిన తర్వాతనే ప్రజలకు సరఫరా చేస్తున్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా, నిరంతర పర్యవేక్షణకు సిబ్బందిని ఏర్పాటు చేశారు. పాలేరు ఇన్టేక్ వెల్ నుంచి వరంగల్ జిల్లా, తిరుమలాయపాలెం మండలానికి తాగునీరు అందించడానికి ఒక్కొక్కటి 540 కిలోవాట్ల సామర్థ్యం గల ఆరు 724 హెచ్పీ మోటర్లు ఏర్పాటు చేశారు. అన్నీ విజయవంతంగా నీటిని పంపింగ్ చేస్తున్నాయి.
పాలేరు ‘మిషన్ భగీరథ’ వివరాలు..
సమస్య వస్తే తక్షణం స్పందిస్తున్నాం..
జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఎలాంటి ఇబ్బంది వచ్చినా వెంటనే సమస్యను పరిష్కరించి తాగునీటిని సరఫరా చేస్తున్నాం. గతంలో వేసవిలో పని చేయాలంటే చాలా ఇబ్బందులు పడ్డాం.. కానీ.. నేడు మిషన్ భగీరథతో తాగునీటి సమస్యలు తీరాయి. గ్రామీణ మంచినీటి వ్యవస్థ, పట్టణ మంచినీటి వ్యవస్థను చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. ఎక్కడా ఇబ్బంది లేకుండా శుద్ధి జలాలను సరఫరా చేస్తున్నాం.
-పుష్పలత, మిషన్ భగీరథ ఈఈ
కేసీఆర్ పంపు నీళ్లే ఆసరా..
తాగునీటి కోసం ఎంతో గోసపడ్డాం. రాత్రనక, పగలనక చేతిపంపుల దగ్గర పడిగాపులు కాసినం. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటింటికీ నీళ్లు వస్తున్నాయి. ఇప్పటికీ కేసీఆర్ పంపునీళ్లే మాకు దిక్కు. వాటిని తాగునీరు, ఇంట్లో అవసరాలకు వాడుకుంటున్నాం. మా ఊరిలో పెద్ద పంపుహౌస్ సైతం ఏర్పాటు చేశారు. అదే ‘మిషన్ భగీరథ’ నీళ్లు లేకపోతే ఈ వేసవిలో చాలా ఇబ్బంది పడేవాళ్లం.
-నారపాటి నాగేంద్రమ్మ, గృహిణి, ఏదులాపురం