పాల్వంచ రూరల్, జూన్ 9 : పాల్వంచ మండలంలోని కిన్నెరసాని విహారయాత్రలో నూతనంగా ‘సఫారీ యాత్ర’ ఈ నెల 13వ తేదీ శనివారం ప్రారంభంకానుంది. ఈ మేరకు అధికారులు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు కిన్నెరసానిలో డీర్ పార్కు సందర్శన, మ్యూజియం, డ్యామ్‌పై విహరించడంతోపాటు రిజర్వాయర్‌లో బోటింగ్ చేయడం లాంటి కార్యక్రమాలు సందర్శకులకు ఆహ్లాదం కలిగించేవి. పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో భాగంగా కిన్నెరసానిలో సఫారీ యాత్రను ప్రారంభించనున్నారు.
కిన్నెరసాని చుట్టూ 8 కిలోమీటర్ల మేర వాహనాల్లో ప్రయాణిస్తూ వన్యప్రాణులను తిలకిస్తూ రెండు గంటలపాటు సాగే విధంగా యాత్రను అధికారులు రూపకల్పన చేశారు. రూ.45 లక్షలతో మూడు సఫారీ వాహనాలను తెప్పించారు. ఒక్కొక్క వాహనంలో ఎనిమిది మంది సందర్శకులు ప్రయాణించవచ్చు. వాహనడ్రైవరే గైడ్‌గా వ్యవహరిస్తాడు. ఈ నెల 13న సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో వర్చువల్‌గా కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేస్తారు.
కిన్నెరసాని డీర్ పార్కు వద్ద జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యేలు హాజరవుతారు. కిన్నెరసానిలో ప్రారంభంకానున్న సఫారీ యాత్ర కేవలం వాహనాల్లో కూర్చుని వన్యప్రాణులను తిలకించడమే కాకుండా మధ్యలో ట్రెక్కింగ్, బోటింగ్ అంశాలను అధికారులు జతచేశారు. పర్యాటకులు ట్రెక్కింగ్ పట్ల అత్యంత ఆసక్తి చూపుతారని అధికారులు భావిస్తున్నారు. ఎకో టూరిజం, గిరి వికాసం ద్వారా ఆరుగురు సిబ్బంది రక్షణగా ఉంటారు.
కిన్నెరసానిలో ప్రారంభంకానున్న ‘సఫారీ యాత్ర’ సందర్శకులను ఆకట్టుకుంటుంది. కేవలం సఫారీయాత్రే కాకుండా పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించేందుకు ట్రెక్కింగ్, రిజర్వాయర్‌లో బోటింగ్ వంటివి ఈ యాత్ర ప్రత్యేకత. అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నాం. ఈ నెల 13న సీఎం వర్చువల్ విధానంలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
– బాబు, ఎఫ్డీఓ, కిన్నెరసాని, పాల్వంచ మండలం