భద్రాచలం, అక్టోబర్ 17 : భద్రగిరి క్షేత్రంలో రామయ్యకు అపర భక్తురాలైన శబరి స్మృతియాత్రను గిరిజనుల సమక్షంలో గురువారం వైభవోపేతంగా నిర్వహించారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఏటా ఆశ్వయుజ పౌర్ణమి రోజు శబరి స్మృతియాత్ర నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది గిరిజన గ్రామమైన అశ్వారావుపేట మండలం వినాయకపురంలో ఉత్సవం నిర్వహించాలని రామాలయ ఈవో రమాదేవి నిర్ణయించడంతో అక్కడ గిరిజన మహిళల కోలాటాలు, కొమ్ము నృత్యాలు, గిరిజన సాంప్రదాయం ప్రకారం శబరి స్మృతియాత్రను కనుల పండువగా నిర్వహించారు.
భద్రాద్రి రామాలయానికి గిరిజనులు సంప్రదాయం ప్రకారం పండ్లు, పూలు తీసుకొచ్చి అర్చకుల వేదమంత్రాల నడుమ వాటిని స్వామివారికి సమర్పించారు.
అనంతరం చప్టా దిగువనున్న తూము నర్సింహదాసు, భక్తరామదాసు విగ్రహాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేసి హారతులిచ్చారు. శబరి మాత విగ్రహానికి కూడా పూలు, పండ్లు, వస్ర్తాలను సమర్పించారు.
అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారి ఉత్సవ విగ్రహాలు, శబరి విగ్రహానికి గిరిజనులు పలు రకాల పూలు, పండ్లు సమర్పించగా.. అర్చకులు స్వామివారి నిత్య కల్యాణం జరిపించారు. అనంతరం గిరిజన పెద్దలను ఆలయ అర్చకులు సత్కరించారు. తొలుత శబరి స్మృతియాత్రలో భాగంగా రామాలయ మాడవీధుల్లో ఉత్సవమూర్తులను ఘనంగా ఊరేగించారు. యాత్రను భక్తులు తిలకించి పరవశించిపోయారు. శబరి స్మృతి యాత్రలో భాగంగా కూనవరం-వీఆర్పురం గ్రామాల మధ్య శబరి నదికి అర్చకులు పూజలు చేసి అక్కడే ఉన్న శబరి విగ్రహానికి నదీజలంతో అభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, గిరిజన పెద్దలు పాల్గొన్నారు.