భద్రాచలం/ అశ్వాపురం/ బూర్గంపహాడ్/ దుమ్ముగూడెం, అక్టోబర్ 21: తాము అధికారంలోకి వస్తే ఇప్పుడున్న రూ.10 వేల రైతుబంధు స్థానంలో రూ.15 వేలు ఇస్తామంటూ కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మొత్తానికే పంటల పెట్టుబడి సాయాన్ని ఎగ్గొడుతున్నారని రైతులు, బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. నమ్మి ఓటు వేసిన అన్నదాతలందరినీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిలువునా వంచించిందని విమర్శించారు. దాని మోసానికి రైతుభరోసా ఎగవేతను మించిన సాక్ష్యం ఇంకేమీ లేదని స్పష్టం చేశారు.
వానకాలం సీజన్ రైతుభరోసా సాయాన్ని ఇవ్వబోమంటూ ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై భద్రాచలం, అశ్వాపురం బూర్గంపహాడ్, దుమ్ముగూడెం మండలాల రైతుల భగ్గుమన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఆయా మండలాల రైతులు, బీఆర్ఎస్ నాయకులు సోమవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా మండలాల్లో ధర్నాలు, ప్రదర్శనలు, రాస్తారోకోలతో నిరసన వ్యక్తం చేశారు. భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో ప్లకార్డులు చేబూని రాస్తారోకో చేశారు.
అశ్వాపురంలో ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. బూర్గంపహాడ్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, రైతులు మాట్లాడుతూ.. వానకాలం పంటల పెట్టుబడి సాయం అందించాల్సిందేనని, ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతుభరోసా అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. అలాగే, రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, వరికి రూ.500 బోనస్ చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.
భద్రాచలంలో బీఆర్ఎస్ నాయకులు ఆకోజు సునీల్‌కుమార్, పడిసిరి శ్రీనివాస్, బీరబోయిన వెంకటనరసమ్మ, రామకృష్ణ, కోలా రాజు, గుంజా ఏడుకొండలు, తూతిక ప్రకాశ్, సూరిబాబు, అశ్వాపురంలో కోడి అమరేందర్, మర్రి మల్లారెడ్డి, కంచుగట్ల వీరభద్రం, ఈదర సత్యనారాయణ, కొల్లు మల్లారెడ్డి, వెన్న అశోక్‌కుమార్, బూర్గంపహాడ్‌లో గోపిరెడ్డి రమణారెడ్డి, జక్కం సుబ్రహ్మణ్యం, సాదిక్‌పాషా, వలదాసు సాలయ్య, కొనకంచి శ్రీను, చల్లకోటి పూర్ణ, సూరం కృష్ణ, భూపెల్లి నర్సింహారావు, మేడగం శ్రీనివాస్‌రెడ్డి, సానికొమ్ము రామచంద్రారెడ్డి, దుమ్ముగూడెంలో మానె రామకృష్ణ, రావులపల్లి రాంప్రసాద్, కణితి రాముడు, జానీపాషా, తునికి కామేశ్వరరావు, అపకా వీర్రాజు, దామెర్ల శ్రీనివాస్, జోగా వెంకటరమణ, మోతుకూరి శ్రీకాంత్, అల్లాడి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.