ప్రతి నెలా ఒకటో తేదీ వచ్చే సరికెల్లా పాల వాడి దగ్గర నుంచి గ్యాస్ వాడి దాకా ఎవరి బిల్లులు వాళ్లకు కట్టాలని, ఒకటో తారీఖు వస్తుందంటే భయపడే పరిస్థితి ఉందని చెప్పే ఇతివృత్తాన్ని ఎంచుకొని పాతికేళ్ల క్రితం ఈవీవీ సత్యనారాయణ చిత్రీకరించిన ‘అమ్మో.. ఒకటో తారీఖు’ సినిమా 90’స్ జనరేషన్ వాళ్లకు ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. పేదరికం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు వారి దైనందిన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు పడుతుంటారో అనే వృత్తాంతాన్ని ఎల్బీ శ్రీరాం ప్రధాన పాత్రధారిగా నటించిన ఆ సినిమా.. కళ్లకు కట్టి చూపించింది. పేదల బతుకులు కూడా ఆ కథకు బాగా కనెక్ట్ అవుతాయి. దీంతో ఆ సినిమాకూ మంచి ఆదరణ లభించింది.
అయితే.. అదే విధంగా జూన్ నెలకు కూడా సరిగ్గా అలాంటి ప్రత్యేకతే ఉంటుంది. వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉండే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పల్లె ప్రాంతాలే ఎక్కువ. వీటిల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవించే జనాభానే అత్యధికం. ఏరువాక ముగిసినందున ఒకటీ రెండు జల్లులు పడగానే వ్యవసాయ పనులు ముమ్మరమయ్యే కాలం. అదే.. జూన్ మాసం. ఇది రైతులకేగాక విద్యార్థుల తల్లిదండ్రులకూ కీలకమైన మాసం. సుమారు రెండు నెలల వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టాల్సిన సమయం.
పెన్నులు, పుస్తకాల నుంచి యూనిఫాం వరకూ సమస్తమూ కొనుగోలు చేయాల్సిన తరుణం. అందుకని ఈ జూన్.. అటు అన్నదాతలకు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులకు ఖర్చులను అమాంతం పెంచే మాసం. అందుకే ఆ సినిమాలో ఈవీవీ చెప్పినట్లుగా ప్రతి నెలా ‘అమ్మో.. ఒకటే తారీఖు..’ అంటూ దిగ్గున మేల్కొనే పరిస్థితి ఉంటే.. ఏటా జూన్‌లోనూ ‘అమ్మో.. జూన్ నెల..’ అంటూ హడలిపోయే పరిస్థితి కూడా ఉంటోంది. ఏటా జూన్ నెలలో అటు సాగుదారులకు, ఇటు పిల్లల తల్లిదండ్రులకు పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ప్రత్యేక కథనం.
-సత్తుపల్లి, జూన్ 10
జూన్ నెల ఆగమించడంతో పిల్లలు బడిబాట, పెద్దలు పొలంబాట పట్టే కాలం ఆసన్నమైంది. దీంతో ఇటు రైతుల్లోనూ, అటు పిల్లల తల్లిదండ్రుల్లోనూ ఖర్చుల గుబులు మొదలైంది. వ్యవసాయానికి పెట్టుబడులు ఎంత అవసరమో.. పిల్లల చదువుకు ఖర్చులూ అంతే అవసరం. అయితే, రెండింటికీ ఒకే నెలలో అధికంగా వెచ్చించాల్సి రావడంతో సాగుదారులు, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. జూన్ నెల గట్టెక్కేంత వరకూ అష్టకష్టాలను ఎదుర్కొంటుంటారు.
గత కేసీఆర్ ప్రభుత్వంలో మే నెలలోనే రైతుబంధు వచ్చి పంటల పెట్టుబడికి ఎంతో ఆసరాగా ఉండేది. సకాలంలో విత్తనాలు, ఎరువులు తెచ్చుకునేందుకు, ట్రాక్టర్ల కిరాయి డబ్బులు చెల్లించేందుకు ఆర్థికంగా కొంత అక్కరకొచ్చేది. కానీ.. తాము అధికారంలోకి వచ్చి ఇస్తామన్న రైతుభరోసా సాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో ఇవ్వకపోవడం, ఒకవేళ ఇచ్చినా కొందరికే ఇస్తుండడం వంటి కారణాలతో అన్నదాతలు కూడా తమ పంటల పెట్టుబడి అవసరాల కోసం అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల వద్ద పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఖర్చులు అమాంతంగా పెరిగిన దరిమిలా పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రైవేటు బడులకు పంపాలంటే ఫైనాన్స్ తీసుకోక తప్పని పరిస్థితి.
వానకాలం సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలకు పెట్టుబడి వ్యయం ఎంతో అవసరం. వ్యవసాయంలో ఎడ్లు, బండ్లు, నాగళ్లు, అరకలు దాదాపుగా కనుమరుగై యాంత్రీకరణ అమాంతంగా పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ పెట్టుబడులు పెనుభారమవుతున్నాయి. ఏ పంట వేయాలన్నా ట్రాక్టర్‌తో దున్నించినందుకు ఎకరానికి రూ.20 వేలకు పైగానే ఖర్చవుతున్న పరిస్థితి. ఇక విత్తనాలు, ఎరువులు, కలుపుమందులు, నాట్లు, పంటల కోతల వంటి వాటి ఖర్చులూ గణనీయంగా పెరిగిన దయనీయ స్థితి. అయితే, అన్నదాతలను ఆదుకునేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం వానకాలం, యాసంగి సీజన్లకు కలిపి ఎకరానికి రూ.10 వేలను సకాలంలో రైతుల ఖాతాల్లో జమ చేయడం; ఎరువులు, విత్తనాల వంటివి సబ్సిడీపై ఇవ్వడం వంటివి అన్నదాతలను ఆర్థికంగా ఎంతగానో ఆదుకునేవి. కాంగ్రెస్ వచ్చాక ఆ పరిస్థితి లేకుండా పోవడంతో కర్షకులు మళ్లీ అధిక వడ్డీలైనా వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఇక జూన్ నెల వచ్చిందంటే అటు సాగుదారులైనా, ఇటు సామాన్యులైనా అప్పులు తెచ్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ద్రవోల్బణం కారణంగా ఈ ఖర్చులు ఏటికేడు గణనీయంగా పెరిగిపోతున్నాయి. అయితే, ఇంతటి అధిక ఖర్చులు ఒకే నెలలో ఒకేసారి రావడంతో రైతులు, పిల్లల తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవున్నారు. జూన్ నెల గట్టెక్కడం సవాలుగా ఉందంటూ సామాన్య ప్రజలు నిట్టూరుస్తుండడం గమనార్హం.
విద్యా ద్రవ్యోల్బణమైతే ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. చిన్న చిన్న ప్రైవేటు స్కూళ్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద కార్పొరేట్ విద్యాసంస్థల వరకూ అన్నింట్లోనూ ఫీజులు భారీగానే ఉన్నాయి. పుస్తకాల కోసం, యూనిఫాం కోసం, రవాణా సౌకర్యం కోసం అంటూ ప్రత్యేకమైన ఫీజులు పెడుతుండడంతో తల్లిదండ్రులందరిదీ కట్టక తప్పని పరిస్థితి. జూన్ 12న స్కూళ్లు తెరిచేలోగా ఖమ్మం జిల్లాలోని సుమారు 90 వేల మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు పెట్టాల్సిన ఖర్చుల లెక్కలు తీస్తే కళ్లు తిరగకమానవంటే అతిశయోక్తి కాదు. దీంతో పంటల పెట్టుబడి కోసం రైతులు, పిల్లల ఫీజుల కోసం తల్లిదండ్రులు జూన్ నెల మొత్తం ఉరుకులు, పరుగులు పట్టాల్సిన పరిస్థితి.
జూన్ నెలలో పంటల సాగు కోసం రైతులకు ఖర్చులు విపరీతంగా ఉంటాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చి రైతులను కొంత ఆదుకునేది. కానీ.. కాంగ్రెస్ వచ్చాక సకాలంలో రైతుభరోసా ఇచ్చిందీ లేదు. అన్నదాతలను ఆదుకున్నదీ లేదు. దీంతో పంటల పెట్టుబడి కోసం అప్పుల కోసం పరుగులు పెట్టాల్సి వస్తోంది.
-కాకా ప్రసాద్, రైతు, తాళ్లపెంట
ఉన్నంతలో పిల్లలను కొంచెం ప్రైవేటు పాఠశాలలో చదివించుకుందామనుంటే ఫీజులు మాత్రం హడలెత్తిస్తున్నాయి. ప్రైవేటు చదువంటే మోయలేనంత భారంగా ఉంటోంది. ట్యూషన్ ఫీజుకు, పుస్తకాలకు, యూనిఫాంకు అంటూ ప్రైవేటు స్కూళ్ల బాధ్యులు వేటికవే ప్రత్యేకంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అందుకే జూన్ వచ్చిందంటే భయమేస్తోంది.
-మట్టా రాజేశ్, పేరెంట్, పెనుబల్లి