సీఎం కేసీఆర్ ‘రైతుబంధు’తో అన్నదాతకు ఆత్మబంధువై నిలిచారు. ఇప్పటివరకు తొమ్మిది విడతలుగా రైతుబంధు సొమ్ము జమ చేసిన సర్కారు.. పదో విడత పంపిణీ చేస్తున్నది. మూడురోజుల్లో ఖమ్మం జిల్లాలో 45,950 మందికి 151.62 కోట్లు, భద్రాద్రి జిల్లాలో 63,946 మందికి రూ.36.18 కోట్ల సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేసింది.
-ఖమ్మం డిసెంబర్30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు అండ గా నిలుస్తున్నది. ఇప్పటికే వ్యవసాయ రంగలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రభు త్వం.. రైతులకు పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నది. ఒక ఎకరానికి రూ.5,250 చొప్పున సొమ్ము నేరుగా రైతు ఖాతాలో జమ చేస్తున్నది. ఇప్పటివరకు తొమ్మిది విడతలుగా రైతుబంధు సొమ్ము జమ చేసిన సర్కారు.. తాజా పదో విడత పంపిణీ ప్రారంభించింది. గడిచిన మూడురోజులుగా ఖమ్మం జిల్లాలో 151.62 కోట్ల రూపాయలను రైతుల అకౌంట్లలో జమ చేసింది. తొలిరోజు 1,03,942 మందికి రూ.35.62కోట్లు, రెండోరోజు 79,288 మందికి రూ.60.35 కోట్లు, మూడోరోజు శుక్రవారం 45,950 మందికి రూ.57.65 కోట్లు రైతుల ఖాతాలో సొమ్ము జమ అయ్యాయి.
జోరందుకున్న సాగు పనులు
పెట్టుబడి సాయం అందుతుండటం.. యాసంగి సీజన్లో భూగర్భజలాలు పుష్కలంగా ఉండటంతో జిల్లావ్యాప్తంగా సాగు పనులు జోరందుకున్నాయి. 3,28,491 మంది రైతులకు రూ.363.44 కోట్లు కేవలం పదిరోజుల వ్యవధిలోనే అన్నదాతలకు అందజేసేందకు సర్కార్ నిర్ణయం తీసుకున్నది. అందుకు అనుగుణంగానే చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యతాక్రమంలో సొమ్ము జమ చేస్తున్నారు. ప్రస్తుతం సాగుకు పెట్టుబడి అవసరాలు తోడుకావడంతో ఆయా గ్రామాల రైతులు బ్యాంకుల దగ్గరికి వెళ్లి రైతుబందు సొమ్మును విత్డ్రా చేసుకుంటున్నారు. విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసేందుకు నగరంలో షాపుల దగ్గర క్యూకడుతున్నారు. రెండు రోజుల నుంచి మండల, జిల్లా కేంద్రాల్లో రైతుల రద్దీ తీవ్రంగా ఉంది. ఇప్పటికే కొందరు రైతులు విత్తనాలు కొనుగోలు చేయగా.., మిగిలిన రైతులు రెండు, మూడు రోజుల నుంచి కొనుగోలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లా వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం పైరు కనిపిస్తున్న సాగు విస్తీర్ణం పరిశీలిస్తే జిల్లావ్యాప్తంగా నేటి వరకు సుమారు 50 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు జరిగింది.
63,946 మందికి.. రూ.36.18 కోట్లు
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ) : పంట పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో జమ అవుతున్నది. భద్రాద్రి జిల్లాలో మొత్తం 1,34,370 మంది రైతులకు 204 కోట్లు మంజూరు కాగా, తొలిరోజు 30,905 మంది రైతులకు రూ.10.67 లక్షలు జమ చేశారు. రెండో రోజు 86,127 మంది రైతులకు రూ.64.04 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ అయ్యాయి. మూడోరోజు 63,946 మందికి రూ.36.18 కోట్ల సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అయ్యింది. మూడోరోజు అశ్వారావుపేటలో 15,938, భద్రాచలంలో 11,865, కొత్తగూడెంలో 12,710, మణుగూరులో 14,683, ఇల్లెందులో 8,950 మంది రైతులకు రైతుబంధు సాయం అందింది.
పెట్టుబడి సాయం అందుతున్నది
మధిర, డిసెంబర్30 : రైతుబంధు పథకంతో రైతులకు పెట్టుబడి సాయం అందుతున్నది. సీఎం కేసీఆర్ రైతుల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం ఎంతో ప్రయోజనకరం. నాకు ఎకరం 10 కుంటలు ఉంది. దానిలో వర్షాకాలం పంట పత్తి సాగు చేశాను. కేసీఆర్ ప్రభుత్వం నాకు బ్యాంకు ఖాతాలో రూ.6,250 జమ చేసింది. పత్తి విత్తనాలు, వ్యవసాయ పనులకు ఉపయోగించా. మళ్లీ యాసంగి సాగుకు బుధవారం నా ఖాతాలో రూ.6,250 జమ అయింది. మొక్కజొన్న విత్తనాలు, ఎరువులు తెచ్చుకున్నా. సీఎం కేసీఆర్ రైతుబంధు అమలు చేయకపోతే అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడేది. ఇప్పుడు రైతులు అప్పులు చేసుకునే పరిస్థితి లేకుండాపోయింది.
– షేక్ఫ్రీ, రైతు, ముష్టికుంట్ల, బోనకల్లు మండలం
సన్న, చిన్నకారు రైతులకు భరోసా
సన్న, చిన్నకారు రైతులకు రైతుబంధు పథకం భరోసానిచ్చింది. నాకు ఎకరం భూమి ఉంది. ఏటా పత్తి లేక మిర్చి పంటలు సాగు చేస్తున్నా. ఈ ఏడాది మిరప సాగు చేశా. ప్రభుత్వం ఎకరాకు రూ.5 వేలు మొదటి పంటకు నా బ్యాంకు ఖాతాలోజమ చేసింది. ఆ డబ్బుతో మిరప పైరు సాగు చేశాను. ఎక్కడా అప్పులు తెచ్చుకోకుండా ఈ డబ్బులతో మిరప సాగు చేశాను. యాసంగిలోజమైన డబ్బు ఎరువులు, పెట్టుబడులకు ఉపయోగపడుతున్నది. వ్యవసాయం దండగ అనుకున్న రైతులకు కేసీఆర్ పండుగ చేశారు. 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడంతోపాటు సంవత్సరానికి రూ.10 వేలు పెట్టుబడి సాయం అందిస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. -రెంటపల్లి దాసు,
రైతు, మాటూరుపేట, మధిర మండలం