కారేపల్లి, జూలై 21 : నిత్యం గ్రామాల్లో ప్రజలతో మమేకమై జీవిస్తూ ప్రాథమిక వైద్యం చేసుకుని జీవించే గ్రామీణ వైద్యులపై ఐఎంసీ, ఐఎంఏ అధికారుల దాడులను ఆపి, గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పిట్టల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కారేపల్లిలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంతారపు వెంకటాచారితో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మారుమూల పల్లె ప్రజలకు ప్రాథమిక వైద్యం అందిస్తున్న ఆర్ఎంపి, పిఎంపిలపై కొంతమంది క్వాలిఫైడ్ డాక్టర్లు కక్ష పూరితంగా వ్యవహరిస్తూ, ఎలాంటి వైద్య సేవలు అందించరాదని గ్రామాల చుట్టూ తిరుగుతూ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను సీజ్ చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామీణ వైద్యులకు గుర్తింపు నివ్వాలన్నారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు గ్రామీణ వైద్యుల గుర్తింపు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ఆర్ఎంపీలకు గుర్తింపు ఇవ్వనిచో రాష్ట్రంలోని అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం చేసి పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు దొడ్డా పోల్రాజు, గరిడేపల్లి వెంకటరామయ్య, ఆకారపు రఘు, గణితి సైదులు, శివ పాల్గొన్నారు.