ఖమ్మం, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిల పక్షాలు, కార్మిక, ప్రజాసంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామీణ భారత్ బంద్ విజయవంతమైంది. వామపక్షవాదులు, ప్రజాసంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చి బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రదర్శనలు, రాస్తారోకోలు నిర్వహించారు. తెల్లవారుజామునే పట్టణాల్లోని బస్ డిపోల వద్దకు వెళ్లి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. బంద్ పిలుపును అందుకుని వ్యాపార వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంక్‌లు, విద్యాసంస్థలు, బ్యాంకులు, సినిమా థియేటర్ల యాజమాన్యాలు స్వచ్ఛందంగా వాటిని మూసివేశాయి. ఆటో డ్రైవర్ల యూనియన్లు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. బంద్ కారణంగా బ్యాంకుల్లో లావాదేవీలు నిలిచిపోయాయి. రాస్తారోకోల కారణంగా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.
దీంతో ప్రజారవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకున్నారు. కొత్తగూడెంలో అఖిల పక్షాల ఆధ్వర్యంలో నాయకులు ర్యాలీ నిర్వహించారు. సింగరేణి పరిధిలోని గనుల్లో వివిధ సంఘాలకు చెందిన కార్మికులు విధులకు గైర్హాజరయ్యారు. నిరసన కార్యక్రమాల్లో సీపీఐ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, టీడీపీ, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ (ఎంల్) ప్రజాపంథా, సీపీఐ (ఎంల్) న్యూ డెమోక్రసీతో పాటు ఇతర సంఘాలు, పార్టీలకు చెందిన నాయకులు నున్నా నాగేశ్వరరావు, పోతినేని సుదర్శన్‌రావు, ఎర్రా శ్రీకాంత్, విక్రమ్, పోటు ప్రసాద్, భాగం హనుమంతరావు, తాటి వెంకటేశ్వర్లు, జానీమియా, పోటు కళావతి, నిర్మల, కొత్త సీతారాములు, నున్నా మాధవరావు, గోకినపల్లి వెంకటేశ్వరరావు, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.