– కొనుగోలుకేంద్రాలు ప్రారంభించాలి
– ఐక్య రైతు సంఘం ఖమ్మం జిల్లా నేత కమ్మకోమటి నాగేశ్వరరావు
కారేపల్లి, ఏప్రిల్ 03 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నాయని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఖమ్మం జిల్లా నాయకుడు కమ్మకోమటి నాగేశ్వరరావు విమర్శించారు. శుక్రవారం కారేపల్లి మండలం పేరుపల్లిలో జరిగిన రైతు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ చట్టాలతో కేంద్రం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల చేతిలోకి నెట్టాలని చూస్తుందన్నారు. ఎరువుల సబ్సిడీలు తగ్గించడం, విద్యుత్ చట్టానికి సవరణలు చేయడం దానిలో భాగమేనన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని ప్రకటనలతోనే సరిపుచ్చుకుంటుందన్నారు. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి రైతాంగాన్ని పూర్తి స్ధాయిలో ఏ పథకం వర్తింప చేయలేదన్నారు. రుణమాఫీ 60 శాతం మందికి రాలేదని, 2025`రబీ ధాన్యం బోనస్ జాడలేదన్నారు. రైతు భరోసా వాయిదాల పర్వం నడుస్తుందని ఎప్పటి వరకు సాగిస్తారో అర్ధంకాని పరిస్ధితి ఉందన్నారు.
వర్షాలు, తెగుళ్లతో పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్న రైతులు అధికంగా మొక్కజొన్నసాగు చేశారని వారికి గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవాల్సి ఉండగా ప్రకటనలతోనే సరిపుచ్చుకుంటున్నారని ఆరోపించారు. మొక్కజొన్న కోతకు వచ్చిందని రైతులు ప్రైవేట్ వ్యాపారస్తులకు రూ.16 వందలకు అమ్మాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.2,400 రావాలంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, ఎకరాకు 40 క్వింటాళ్ల మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొల్లేటి నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాశం అప్పారావు, మల్లిదు నాగేశ్వరావు, కేలోతు లక్ష్మణ్. గుగులోతు తేజానాయక్, శంకర్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రావుల నాగేశ్వరావు పాల్గొన్నారు.