కారేపల్లి, అక్టోబర్ 23 : దేశంలో మహిళల హక్కులు రోజురోజుకు హరించుకు పోతున్నాయని ఐద్వా ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు మెరుగు రమణ అన్నారు. హైదరాబాద్లో ఈ నెల 25 నుండి 28వ తేది వరకు జరగనున్న ఐద్వా జాతీయ మహాసభల విజయవంతానికి గురువారం కారేపల్లి మండలం కారేపల్లి క్రాస్ రోడ్, లింగంబంజర, ఉసిరికాయలపల్లి గ్రామాలలో ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళ రక్షణకు చట్టాలు ఉన్నా ఆగంతులకు పాలకులు కొమ్ముకాస్తుండంతో మహిళలకు రక్షణ కరువైందన్నారు. చట్ట సభలలో మహిళలకు రిజర్వేషన్ బిల్లుపై వామపక్షాలు మినహా మిగతా పార్టీలకు చిత్తశుద్ది లేదన్నారు. బాలికలపై హింస పెరిగిందని, మహిళా భద్రతకు కఠినమైన చట్టాలు తేవాలని ఆమె డిమాండ్ చేశారు.
సామాజిక వ్యవస్థలో మార్పు రావాలని దానికి మహిళలు చైతన్యవంతులుగా పోరాడాలన్నారు. మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నఐద్వా జాతీయ మహా సభలకు జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు టీచరు. మరియం దావలె, కోశాధికారి ఎస్.పుణ్యవతి, ఉపాధ్యక్షురాలు సుధాసుందరరామన్ వంటి జాతీయ నాయకులు హాజరవుతారన్నారు. మహాసభల విజయవంతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాళ్లు భూక్య లక్ష్మి, ఎల్లావుల శ్రావణి, బానోతు సరోజిని, మూడు అరుణ, మంగమ్మ, పద్మ, యశోదమ్మ, జ్యోతి పాల్గొన్నారు.