ఖమ్మం, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం రెండో రోజుకు చేరింది. తెల్లవారుజామునే సమ్మె చేసేందుకు డిపోల వద్దకు కార్మికులు చేరుకోగా.. యాజమాన్యం బస్సులు నడిపేందుకు సిద్ధమవుతుండగా బస్సులు బయటకు వెళ్లకుండా కార్మికులు అడ్డుకొని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమాలు ఉధృతం చేశారు. బస్సులు రెండో రోజు రోడ్డెక్కకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. అయితే ఆర్టీసీ అద్దె బస్సులను మాత్రం వివిధ ప్రాంతాలకు నడిపించారు. పల్లె వెలుగు బస్సులు మాత్రమే నడవడంతో హైదరాబాద్, విజయవాడ, వరంగల్, నిజామాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందుపడ్డారు. ఖమ్మంలో ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సంఘీభావం ప్రకటించారు.
మధిర డిపో వద్ద ఆందోళన నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు మద్దతు ప్రకటించారు. సత్తుపల్లి డిపో వద్ద సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సంఘీభావం తెలిపారు. భద్రాచలంలో బుధవారం అర్ధరాత్రి పోలీసులు ఆర్టీసీ ఇన్‌గేట్ వద్ద నిరసన తెలిపేందుకు వేసుకున్న టెంటును పోలీసులు తొలగించారు. ఎంత చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని కార్మికులు ఆరోపించారు. గురువారం యథావిధిగా కార్మికులు డిపో వద్ద ఆందోళన కొనసాగించారు. ఇల్లెందులో ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు సమ్మె చేస్తున్న కార్మికులకు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్ సంఘీభావం తెలిపారు. కొత్తగూడెంలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును కలిసి తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. మణుగూరులో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. అయితే మణుగూరు పట్టణంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో ముందస్తుగా ఆర్టీసీ కార్మికులు ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఖమ్మం ఆర్టీసీ రీజియన్ పరిధిలో 351 బస్సులు నడిపించినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మెను వీడేది లేదని కార్మికులు భీష్మించడంతో డిపోలవారీగా బస్సులను నడిపేందుకు ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలకు అర్హులైన వారిని వెతికే పనిలో యాజమాన్యం నిమగ్నమైంది. ఖమ్మం ఆర్టీసీ రీజియన్ పరిధిలోని మధిర, సత్తుపల్లి, ఇల్లెందు, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోల ఎదుట కార్మిక సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఆర్టీసీ నడిపే బస్సులను కార్మికులు అడ్డుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఖమ్మంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో కార్మికులలో ఒక్కసారిగా అలజడి రేకెత్తింది.