ఖమ్మం, నవంబర్ 22: ఆర్టీసీ కార్మికుల విరాళాలతో కొనుగోలు చేసిన భూమిని ఇద్దరు వ్యక్తులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆర్టీసీ ఎన్ఎంయూ యూనియన్ నేతలు, విశ్రాంత ఉద్యోగులు ఆరోపించారు. దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్టీసీ ఖమ్మం డిపో ఎదుట శనివారం ఆందోళన నిర్వహించారు. ఆర్టీసీలోని ఇతర సంఘాల నేతలు సైతం వీరికి సంఘీభావంగా ఆందోళనలో పాల్గొన్నారు. ఎన్ఎంయూ రీజినల్ సెక్రటరీ ఆర్వీ వీరభద్రం, నాయకులు ఆర్ఎస్ రామారావు, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.పాండురంగారావు, ఎన్ఎంయూ మాజీ రీజినల్ సెక్రటరీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ సెక్రటరీ వీ చక్రధర్‌రావు, రిటైర్డ్ ఎంప్లాయీస్ రీజినల్ ప్రెసిడెంట్ బీవీ రావు తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు.
కార్మికులు, యూనియన్ నాయకులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు అండగా ఉండాలని 2002లో ఖమ్మం డిపో ఎదుట 350 గజాల భవనాన్ని యూనియన్ పేరిట కొనుగోలు చేసినట్లు తెలిపారు. నాటినుంచి ఓ గదిలో యూనియన్ ఆఫీస్ కొనసాగుతోందన్నారు. అయితే యూనియన్‌లోని ఇద్దరు నాయకులు (విశ్రాంత ఉద్యోగులు) అజయ్‌కుమార్, ఎల్ఆర్కే రావు సుమారు 210 గజాల స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఆ అక్రమ రిజిస్ట్రేషన్‌ను వెంటనే రద్దు చేసి యూనియన్ ఆఫీస్ అన్యాక్రాంతం కాకుండా చూడాలని అధికారులను వేడుకున్నారు. ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్, ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు, విశ్రాంత ఉద్యోగులు పెద్దఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు.