మధిర మే 02 : ఈ నెల 7వ తేదీ నుంచి నిర్వహించే ఆర్టీసీ సమ్మెను జయప్రదం చేయాలని ఖమ్మం రీజియన్ జేఏసీ చైర్మన్ పిల్లి రమేశ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మధిర బస్ డిపో ఎదుట సమ్మె పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, 2017 సంవత్సర వేతన సవరణ బకాయిలు చెల్లించాలని కోరారు. కొత్త అలవెన్స్లు అమలు చేస్తూ రిటైర్డ్ ఉద్యోగులకు 2017 వేతన సవరణ జరిగి అన్ని బకాయిలు చెల్లించాలన్నారు. 2021, 2025 వేతన సవరణలు అమలు చేయాలని, ఉద్యోగ, భద్రతా సిబ్బందిపై అధిక భారాలు తగ్గించాలన్నారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కారణంగా నిరపరాదులైన డ్రైవర్లను శిక్షించరాదన్నారు.
మహాలక్ష్మి పథకం అమలులో జరిగే తప్పులకు సిబ్బందిని అక్రమంగా శిక్షించవద్దన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను కేంద్రం ప్రభుత్వ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు కొని ఆర్టీసీకి ఇవ్వాలన్నారు. కారుణ్య నియామకాలు, రెగ్యులర్ ప్రతిపాదన కింద పని చేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అద్దె బస్సుల ఎలక్ట్రిక్ బస్సుల డ్రైవర్లను, ఇతర సిబ్బందిని ఆర్టీసీలోకి తీసుకోవాలన్నారు. 2019 సమ్మె కాలంలో ఉద్యోగులపై నమోదు చేసిన పోలీస్ కేసులను ఎత్తివేయాలన్నారు. పీఎఫ్, సీసీఎస్ నుండి యాజమాన్యం వాడుకున్న డబ్బులను వడ్డీతో సహా చెల్లించాలని, ఔట్సోర్సింగ్, కాంట్రా్క్ట్ పేరు మీద పనిచేస్తున్న అధికారులను, సూపర్వైజర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తిమ్మినేని రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.అరుణకుమారి, సహయ కార్యదర్శి ఎం.రామచంద్ర రావు , రీజియన్ నాయకులు లాజర్, మధిర డిపో అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు, ఎం.గోపాలరావు, జెవి కృష్ణారావు, జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.