ఖమ్మం: ఆర్టీసీ కార్పొరేషన్ స్థాయిలో ఖమ్మం డిపో సోమవారం అత్యధిక ఆదాయం సాధించింది. అందులో భాగస్వాములైన బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజి సిబ్బంది, సూపర్వైజర్లు తదితర అన్ని విభాగాల ఆర్టీసి ఉద్యోగులకు ఖమ్మం డిపో మేనేజర్ డి.శంకర్రావు మంగళవారం అభినందనలు తెలుపుతూ స్వీట్లు పంచారు. డిపో ఆవరణలో అసిస్టెంట్ మేనేజర్(ట్రాపిక్) టి.స్వామి అధ్యక్షతన ఏర్పాటైన గేట్ సమావేశంలో డిపో మేనేజర్ డి.శంకర్రావు పాల్గొని డిపోకు అత్యధిక ఆదాయం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
సోమవారం కార్పొరేషన్ స్థాయిలో ఖమ్మం డిపో నుంచి సమిష్టి కృషితో 77,198 కిలో మీటర్లు బస్సులను నడపడం జరిగిందన్నారు. ప్రయాణీకుల ఆదరణతో ఒక్కరోజే రూ, 28,02,111 ల గరిష్ట ఆదాయం సాధించడం జరిగిందన్నారు. ఇందులో భాగస్వాములైన ఉద్యోగులందరికీ స్వీట్లు పంచారు. సంస్థ పట్ల అంకితభావంతో ఇదే విధంగా కష్టపడాలని, ప్రయాణీకుల ఆదరణ మరింతగా పొందడం ద్వారా ఖమ్మం డిపోను అగ్రభాగాన నిలుపుదామన్నారు.
ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ చంద్రశేఖర్, సూపర్వైజర్లు బి.వెంకన్న, జిఆర్రెడ్డి, డ్యూటీ చార్ట్ కంట్రోలర్ ఆకుతోట శ్రీనివాసరావు, ఉద్యోగులు నాగేశ్వరరావు, నరసింహా, శ్రీనివాస్, ఆర్సి రెడ్డి, నమేష్, పీటర్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.