ఖమ్మం నగరానికి చెందిన సురేశ్.. బెంగళూరులో ఉన్నత చదువులు చదువుతూ సెలవుల నిమిత్తం ఇటీవల ఇంటికి వచ్చాడు. చదువుకునే ప్రదేశంలో ద్విచక్ర వాహనం కలిగిన సురేశ్‌కు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం కాగా ఖమ్మంలో ఓ నెట్ సెంటర్‌ను ఆశ్రయించి డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ చేయాలని కోరాడు. ఆ నెట్ సెంటర్ నిర్వాహకుడు సంబంధిత పత్రాలు తీసుకొని స్లాట్ ప్రక్రియను మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ఒకటి, రెండు ఓటీపీలు చెప్పిన సురేశ్ స్లాట్‌కు చెందిన మూడో ఓటీపీ చెప్పే క్రమంలో ఎర్రర్ వచ్చింది. దీంతో స్లాట్ బుకింగ్ ప్రయత్నం ఫెయిలైంది. దీనికి సుమారు 40 నిమిషాల సమయం పట్టింది. మరోమారు ప్రయత్నించగా మళ్లీ ఇదే సీన్ రిపీటైంది.
దీంతో గంటన్నర సమయం వెచ్చించినా ఆన్లైన్ స్లాట్ బుకింగ్ కాలేదు. దీంతో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని వచ్చిన సురేశ్ ఆశలు అడియాశలయ్యాయి. తిరుమలాయపాలేనికి చెందిన వెంకటేశ్వర్లు అనే 54 ఏళ్లు పైబడిన వ్యక్తి తన లైసెన్స్ రెన్యూవల్ కోసం ఖమ్మం ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయం ఎదురుగా ఉన్న మీ-సేవా కేంద్రానికి వెళ్లాడు. మీ-సేవా నిర్వాహకులు లైసెన్స్ రెన్యూవల్‌కు స్లాట్ బుక్ చేస్తుండగా లైసెన్స్ పొందిన సమయంలో వెంకటేశ్వర్లు అందించిన మొబైల్ నంబర్‌కు ఆటోమేటిక్‌గా ఓటీపీలు వెళ్తున్నాయి. వెంకటేశ్వర్లు ప్రస్తుతం ఆ నంబర్ వాడకపోవడంతో స్లాట్ బుకింగ్ కాలేదు. మీ-సేవా నిర్వాహకుడి సూచన మేరకు రవాణా శాఖ కార్యాలయంలో అధికారులను కలిసి సమస్యను చెప్పుకున్నాడు. అక్కడ గంటల కొద్దీ వేచి చూస్తే గానీ వెంకటేశ్వర్లు సమస్యకు పరిష్కారం లభించలేదు.
ఇదీ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘సారథి’ పోర్టల్‌తో వాహనదారులు నిత్యం పడుతున్న ఇబ్బంది. ఖమ్మం జిల్లాలో వాహన సేవల నిమిత్తం రవాణాశాఖ కార్యాలయాలకు వెళ్లే ప్రతి వాహనదారుడూ ఎదుర్కొంటున్న సమస్య.
రఘునాథపాలెం, మార్చి 6: రవాణా శాఖలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘సారథి’ పోర్టల్ వాహనదారులకు సమస్యలను తెచ్చి పెడుతోంది. వాహన సంబంధిత సేవలు పొందాలంటే ముందస్తుగా ఆన్లైన్ తప్పనిసరి. అయితే సారథి పోర్టల్‌లో ఆన్లైన్ ప్రక్రియ అవస్థలతో కూడుకున్నదిగా తయారైంది. ఉన్నత చదువులు చదువుకున్నా వాహనదారుడు కూడా నేరుగా ఈ ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేసుకోవడం సాధ్యంకాని పరిస్థితి. రవాణాశాఖ కార్యాయంలో పొందే లెర్నిం
గ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, వాహన రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ వంటి ఏ పనులకైనా ఆన్లైన్ చేసుకోవాలంటే ఏజెంట్లను తప్పక ఆశ్రయించాల్సిందే. అక్కడే ఏజెంట్ చేసే ప్రాసెస్‌లో నాలుగు లేదా ఐదు ఓటీపీలు చెప్తేనే గానీ పనికాని పరిస్థితి. ఒక్కోసారి సర్వర్ సమస్య వస్తే గంటల కొద్దీ అక్కడే నిరీక్షించాల్సిన దుస్థితి.
కాంగ్రెస్ ప్రభుత్వం రవాణా శాఖలో తీసుకొచ్చిన సారథి పోర్టల్ ఏజెంట్లకు అంది వచ్చిన అవకాశంగా మారింది. మధ్యవర్తులకు కాసులు కురిపించేదిగా ఉంది. వాహన సేవల కోసం రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాలంటే అవసరమైన ఆన్లైన్ స్లాట్ కోసం ముందుగా నిష్ణాతులైన ఏజెంటును ఆశ్రయిస్తే కానీ పనికాని పరిస్థితి. నిత్యం రవాణాశాఖ కార్యాలయం వద్ద అర్రులు చాచుకొని కూర్చునే నెట్ సెంటర్ల నిర్వాహకులు, పలువురు ఏజెంట్లు వాహన సేవలకు వచ్చిన వాహనదారుల నుంచి స్లాట్ బుకింగ్‌ల పేరుతో దోచుకుంటున్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరైనా వాహనదారుడు కొత్తగా లైసెన్స్ పొందాలనుకుంటే నేరుగా తానే స్వయంగా ఆర్టీఏ ఆన్లైన్లో ఒక్కసారి ఓటీపీ ఎంటర్ చేసి తన అడ్రస్, ఆధార్ నంబర్ నమోదు చేస్తే చాలు.. కేవలం రెండు నిమిషాల్లోనే స్లాట్ బుక్ అయ్యేది. మరునాడే ఎంచక్కా వాహనదారుడు ఆర్టీవో ఆఫీసుకి వెళ్లి సులువుగా లైసెన్స్ పొందే వీలు ఉండేది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ అమలుచేస్తున్న సారథి పోర్టల్ కఠినతరంగా ఉండడంతో వాహనదారులందరూ ఏజెంట్లను ఆశ్రయించి చేతి చమురు వదిలించుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన సులభతరమైన విధానాల వల్ల ఒక్క క్లిక్ చేస్తే చాలు.. వాహన సేవలన్నీ మొబైల్ డిస్ప్లేపై దర్శనమిచ్చేవి.
సుమారు 57 రకాల వాహన సేవలను ఆన్లైన్ చేసి సులభతరం చేశారు. కానీ, ప్రస్తుతం ఒక్క క్లిక్ కాదు.. వందలాది క్లిక్‌లు చేసినా ఒక్క సేవ కూడా సకాలంలో అందని పరిస్థితి. సారథి పోర్టల్‌లో ఏదైనా సేవల కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవడం మొదలు.. లైసెన్స్ పొందే వరకు జరిగే ప్రక్రియ అంతా వాహనదారులకు నరకం చూపిస్తోంది. నాలుగు ఓటీపీలు, ఐదు క్యాప్చాలు ఎంటర్ చేయాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఏమాత్రం చిన్న ఎర్రర్ వచ్చినా ఆ పని మళ్లీ మొదటికి వచ్చినట్లే. ఇలా ఒక్కో స్లాట్ బుకింగ్‌కు సుమారుగా గంట సమయం పడుతోందని మీ-సేవా నిర్వాహకులు అంటున్నారు. గతంలో వాహనదారుడు లేకున్నా ఫోన్లో తనకు వచ్చిన ఓటీపీ ఒక్కసారి చెప్తే చాలు.. స్లాట్ బుక్ అయ్యేదని వాహనదారులు పేర్కొన్నారు.