వెండితెరపై స్పైడర్‌మ్యాన్‌గా అద్భుత విన్యాసాలు చేస్తూ, ఎంతటి కఠినమైన పాత్రలకైనా క్షణాల్లో సిద్ధమైపోయే టామ్ హాలండ్ ఫిట్నెస్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతుంటారు. అయితే, ఈ స్థాయిలో శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడం వెనుక పెద్ద రహస్యమేమీ లేదని, తన ఆహార అలవాట్లు సైతం సాధారణంగా ఉంటాయని తన ఫిట్నెస్ సీక్రెట్‌ను బయటపెట్టాడు టామ్. జిమ్‌లో గంటల తరబడి చెమటోడ్చడం కంటే, మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని తీర్చిదిద్దుతుందని చెప్పుకొచ్చాడు.
ఇటీవల మెన్స్ హెల్త్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తీసుకునే పౌష్టికాహారం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అల్ఫాహార సమయంలో పండ్లు, ప్రొటీన్ షేక్స్ తాగుతూ, మధ్యాహ్న భోజనాన్ని పూర్తిగా మానేసినట్లు పేర్కొన్నాడు. తన శరీరంలో ఆశించిన మార్పులకు కారణం 80 శాతం ఆహారం (డైట్), 20 శాతం మాత్రమే వ్యాయామమని తెలిపాడు. నిరంతరం ప్రయాణాల్లో ఉండటం వల్ల సొంతంగా వండుకోవడం కష్టమైనా, తన బాడీ షేప్‌ను కాపాడుకునేందుకు మంచి ఆహారాన్నే తీసుకుంటానన్నాడు టామ్.
మరోవైపు రాత్రి భోజనం విషయంలో మాత్రం చాలా శ్రద్ధ తీసుకుంటానని వెల్లడించిన టామ్.. తన సోదరుడు సామ్ చేసే రుచికరమైన వంటకాలు ఆరగించేందుకు ఎక్కువగా తమ్ముడి ఇంటికే వెళ్తుంటానని తెలిపాడు. తన ప్రేయసి శాకాహారి కావడం వల్ల తన భోజనంలో కూడా ఆకుకూరలు, కూరగాయల వాడకం గణనీయంగా పెరిగిందంటాడు టామ్. సహజంగానే తన శరీర బరువు త్వరగా తగ్గిపోతుందని, అందుకే బాడీ బిల్డింగ్ చేసే సమయంలో ఎకువ కేలరీలు ఉండే ఆహారాన్ని తీసుకుంటానని తన డైట్ చార్ట్ చిట్టా విప్పాడు.
ఎంత హెల్దీ డైట్ పాటించినా తనకు ఇష్టమైన ‘ఇన్-ఎన్-అవుట్ బర్గర్’ తినడానికి ఎంత దూరమైనా వెళ్తానని చెప్పిన ఈ స్పైడర్‌మ్యాన్ ఉల్లిపాయలతో ఉండే డబుల్-డబుల్ బర్గర్ అంటే మహా ప్రాణమని పేర్కొన్నాడు. ఇక కార్బోహైడ్రేట్ల విషయానికొస్తే ఏ రూపంలో ఉన్నా ఆలుగడ్డలు తినడానికి ఇష్టపడతానని, అలాగే ప్రొటీన్ కోసం చికెన్, కాడ్ చేపలను ఎంచుకుంటానని తెలిపాడు. నిమ్మకాయ, వెల్లుల్లి, మిరపకాయలతో బేక్ చేసిన కాడ్ ఫిష్ తయారు చేయడం చాలా తేలికని తన అనుభవాలను పంచుకున్నాడు.