Khammam | బోనకల్లు, జూన్ 01 : యాదవ్, కురుమలకు రూ.2 లక్షల నగదు బదిలీ ద్వారా రెండో విడుత గొర్రెల పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి తుశాకుల లింగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక బోనకల్లులో గొర్రెల, మేకల పెంపకదారుల సంఘం మండల కమిటీ సమావేశం పిక్కెల సీతారాములు అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి తుశాకుల లింగయ్య హాజరై మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో యాదవ్, కురుమలకు రూ. 2 లక్షల నగదు బదిలీ ద్వారా రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందన్నారు. కానీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా హామీని నెరవేర్చకుండా వ్యవహరిస్తుందని విమర్శించారు. పశువైద్యశాలల్లో ఎలాంటి మందులు అందుబాటులో ఉండటం లేదని, రెండేండ్ల నుండి కనీసం నట్టల మందులు కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీరోజు వీధి కుక్కల దాడులు, రకరకాల ప్రమాదాల్లో వందలాది గొర్రెలు చనిపోతున్నాయన్నారు. గొర్రెల కాపరులపై రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్టు అధికారుల దాడులు పెరుగుతున్నాయని, రైతుబీమా ఉందనే కారణం చూపి ప్రమాదవశాత్తు మరణిస్తున్న గొర్రెల కాపరులకు ఎక్స్గ్రేషియా ఇవ్వడం లేదని వాపోయారు. గొర్ల కాపర్ల గ్రామీణ సహకార సంఘాలకు ఎన్నికలు పాత పద్ధతిలోని పశు సమర్ధక శాఖ ద్వారానే ఎన్నికలు జరపాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు చింతల చెర్వు కోటేశ్వరరావు జోనీబోయిన గురవయ్య, మందా వీరభద్రం, పుచ్చకాయల వలరాజు, గంగదేవుల నరసింహ, ఎర్రబోయిన కృష్ణ తదితరులు పాల్గొన్నారు.