వేలాది కోట్లు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
వైరాలో ఇండోర్ స్టేడియం, బోటు షికారు ప్రారంభం
షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు
వైరాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తా
రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు యువజన సర్వీస్శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్
పట్టణాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతాం
మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
వైరా, మార్చి 13 : రాష్ట్రంలో క్రీడలు, పర్యాటక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసు, పర్యాటక శాఖల మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం వైరాలో పలు అభివృద్ధి పనులను మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్యే రాములునాయక్, ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి ఆయన ప్రారంభించారు. ముందుగా రూ.89 లక్షలతో నిర్మించిన ఇండోర్ స్టేడియం, రిజర్వాయర్‌లో రూ. 13లక్షలతో ఏర్పాటు చేసిన బోటులను ప్రారంభించి బోటు షికారు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతంలో పర్యాటక, క్రీడా రంగాల అభివృద్ధిని గత పాలకులు పట్టించుకోలేదని అన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ క్రీడలు, పర్యాటక రంగానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు. వైరాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు.
రాష్ట్రంలో క్రీడారంగంతో పాటు, యువజన, పర్యాటక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసు శాఖ, పర్యాటక శాఖ మంత్రి వీ.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. వైరాలో రూ.89 లక్షల వ్యయంతో క్రీడాకారుల కోసం నూతనంగా నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యే రాములునాయక్, ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి ఆదివారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. ఇండోర్ స్టేడియంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యే రాములునాయక్, ఎమ్మెల్సీ తాతా మధు షెటిల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. అనంతరం రిజర్వాయర్ వద్ద టూరిజం డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో రూ.13 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన రెండు బోట్లను మంత్రులు ప్రారంభించారు. అనంతరం బోట్లలో రిజర్వాయర్‌లో షికారు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో పర్యాటక, క్రీడా రంగాల అభివృద్ధిని గత పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో క్రీడలు, పర్యాటక రంగానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. అందులో భాగంగానే వైరాలో క్రీడాకారుల కోసం మినీ ఇండోర్ స్టేడియం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అంతేకాకుండా స్టేడియం చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు ఎమ్మెల్యే రాములునాయక్ విజ్ఞప్తి మేరకు వెంటనే రూ.2 కోట్ల నిధులు విడుదల చేస్తామని సభా పూర్వకంగా మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణలోని గ్రామీణ స్థాయి క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. అందుకు అవసరమైన వనరులను సమకూరుస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. భవిష్యత్‌లో వైరాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. ఖమ్మానికి సమాంతరంగా వైరా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వం అన్నిరంగాల అభివృద్ధికి సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. రాష్ర్టాభివృద్ధికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషిచేస్తున్నారని కొనియాడారు. భవిష్యత్‌లో వైరాను మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
క్రీడాకారులు ఇండోర్ స్టేడియాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే రాములునాయక్ విజ్ఞప్తి మేరకు భవిష్యత్‌లో వైరాను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ వీపీ.గౌతమ్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, మార్క్‌ఫెడ్ రాష్ట్ర వైస్‌చైర్మన్ బొర్రా రాజశేఖర్, మేయర్ నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్‌చైర్మన్ ముళ్లపాటి సీతరాములు, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గా, మార్కెట్ కమిటీ చైర్మన్ బీడీకే.రత్నం, మున్సిపల్ కమిషనర్ ఎన్.వెంకటపతిరాజు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల పనితీరు భేష్
రాష్ట్రంలో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల పనితీరు భేష్‌గా ఉందని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. వైరాలోని ఎన్వీఎస్.గార్డెన్లో ఖమ్మం జిల్లాకు చెందిన ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నత స్థాయి అధికారులతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఎక్సైజ్ అధికారులు విధి నిర్వహణలో వెనుకడుగు వేయకుండా నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థతో పాటు, ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులపై ఉందన్నారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ అక్రమ రవాణాలో ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించకుండా కేసులు నమోదు చేయాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా పనిచేసిన ఎక్సైజ్ అధికారులకు, పోలీసు సిబ్బందికి రివార్డులు అందజేస్తామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు జీతాలు అధికంగా ఇస్తున్నామన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి మద్యం అక్రమ రవాణాను అధికారులు అరికట్టాలన్నారు. సమావేశంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్‌రావు, సూపరింటెండెంట్ సోమిరెడ్డి, అసిస్టెంట్ ఏఈఎస్ కిరణ్ పాల్గొన్నారు.