ఖమ్మం సిటీ, జూన్ 29: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకాల వేతనాల సమస్యల గురించి బీఆర్ఎస్ పక్షాన ఖమ్మంలో త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సీఎం రేవంత్‌రెడ్డి ఈ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యాశాఖను తన వద్దనే పెట్టుకున్న సీఎం.. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేకపోయినా, గురుకులాలు అస్తవ్యస్తంగా మారినా స్పందించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
ఈ ప్రభుత్వానికి సగం పదవీకాలం అయిపోయిందని, అయినప్పటికీ ఈ సమయంలో ఒక్క తరగతి గదిని గానీ, ఒక్క మరుగుదొడ్డిని గానీ నిర్మించిన దాఖలాలు లేవని విమర్శించారు. రేవంత్ పాలనలో కక్ష సాధింపులు, బూతు పురాణాలు తప్ప మరేమీ లేవని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి విమర్శించారు. రెండున్నరేళ్లు గడిచినా ఇవి తప్ప ఆయన పాలనలో మరేమీ లేవని ఆరోపించారు. తెలంగాణలో ఎక్కడ సభ పెట్టినా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులపై తిట్ల దండకం మొదలు పెడుతున్నారు తప్ప పాలన గురించి ఆలోచించడంలేదని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ పథకాల అమలును పక్కనబెట్టి, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు మరిచి ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని అన్నారు. తానిచ్చిన హామీల గురించి ఏ సభలోనూ ప్రజలకు సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. ఇటీవల నల్లగొండలో సభ పెట్టి 32 నిమిషాలు ముఖ్యమంత్రి ప్రసంగించారని, కానీ ఆవగింజంత కూడా సబ్జెక్టు లేదని విమర్శించారు. తాము అభివృద్ధి చేస్తామంటూ ఆ జిల్లా ప్రజలకో, లేదంటే రాష్ట్ర ప్రజలకో భరోసా కూడా కల్పించలేదని, కేవలం కేసీఆర్‌ను తిట్టి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ద్రోహిగా, రైఫిల్ రెడ్డిగా పేరొందిన రేవంత్‌రెడ్డి తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడడమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు. గత రెండున్నరేళ్లుగా ఆయన వైఖరిలో మార్పు లేదని, రాబోయే కాలంలో వస్తుందన్న నమ్మకమూ కలగడం లేదని ఎద్దేవా చేశారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన కేసీఆర్‌ను విమర్శించే స్థాయి సీఎంకుగానీ, ఇతర కాంగ్రెస్ నేతలకుగానీ లేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండున్నరేళ్లలో విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని రాకేశ్‌రెడ్డి ఆరోపించారు. దీంతో వందలాది డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు మూతపడే స్థితికి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. చదువు పూర్తయినా సర్టిఫికెట్లు చేతికిరాక విద్యార్థులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వారి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కింద రూ.9 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. గత కేసీఆర్ పాలనలో ఎన్నికల కోడ్ కారణంగా ఆగిన నియామక పత్రాల పంపిణీని.. రేవంత్‌రెడ్డి చేపట్టి, ఆయా అభ్యర్థులకు నియామకపత్రాలు చేతిలో పెట్టి అవి తామిచ్చిన ఉద్యోగాలంటూ డబ్బా కొట్టుకుంటుండడం విడ్డూరమని విమర్శించారు. ముఖ్యమంత్రికి ధైర్యముంటే ఓయూ క్యాంపస్‌కు వచ్చి ఇదే విషయాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల గర్జన ఎలా ఉంటుందో అప్పుడు చూడాలని సవాల్ విసిరారు.
తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో గత కేసీఆర్ ప్రభుత్వం రూ.86 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని రాకేశ్‌రెడ్డి గుర్తుచేశారు. కానీ, కాళేశ్వరం వల్ల రూ.లక్ష కోట్లు గోదాట్లో కలిసి పోయాయంటూ రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒకనాడు ఆకలి చావులకు అడ్డాగా, వలసలకు చిరునామాగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశానికే అన్నం పెట్టేంత ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నదంటే కేవలం కాళేశ్వరం పుణ్యమేనన్న నిజాన్ని గ్రహించాలని హితవు పలికారు.
కాళేశ్వరం కూలేశ్వరమే అయితే సీఎం రేవంత్ తన కొండారెడ్డిపల్లి బావుల నుంచి నీళ్లను తెచ్చి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్లను నింపారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మనసంతా మూసీ ప్రక్షాళన పేరుతో రూ.లక్ష కోట్లు దోపిడీ చేయడం మీదనే ఉందని ఆరోపించారు. దానికి కేటీఆర్, హరీశ్‌రావు అడ్డు పడుతున్నందున వారిని బిల్లా, రంగా అంటూ వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ కౌరవులను పొలిమేరల వరకు తరిమికొట్టేందుకు వారిద్దరూ కృష్ణార్జునుల్లా కదం తొక్కుతున్నారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు బిచ్చాల తిరుమలరావు, బలుసు మురళీకృష్ణ, మహ్మద్ రఫీ, జడల కల్యాణ్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.