మధిర, జూన్ 24 : మధిర ముున్సిపాలిటి పరిధి బంజారాకాలనీ నందు అండర్ డ్రైనేజీ నిర్మాణం కోసం రోడ్డును తవ్వి వదిలేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడింది. నడిరోడ్డులో డ్రైనేజీ, చాంబర్ల నిర్మాణం కోసం గుంతలు తీశారు. పనులు పూర్తి చేయకుండా కాలయాపన చేస్తుండడంతో ఈ ప్రాంతవాసుల రాకపోకలకు ఇబ్బంది తలెత్తడంతో పాటు ప్రమాదకరంగా మారిన పరిస్థితి ఏర్పడింది. నడిరోడ్డుపై గుంటలు తవ్వి 15 రోజులు గడుస్తున్నప్పటికీ పనులు పూర్తి చేయకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా ఈ డ్రైనేజీ కోసం తవ్విన గుంటల వల్ల తాగునీటి పంప్లైన్లు పూర్తిగా ధ్వంసం కావడంతో తాగునీటి సమస్య ఏర్పడినట్లు తెలిపారు. ఈ మార్గంలో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు, ద్విచక్ర వాహనదారులు జారి పడిపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్ ద్వారా వెంటనే పనులు చేపట్టి ఇబ్బంది లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.