ఇల్లెందు, నవంబర్ 21: పాలనను తుంగలో తొక్కి సీఎం రేవంత్‌రెడ్డి కక్షపూరిత రాజకీయాలు చేస్తూ.. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ మండిపడ్డారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏసీబీ విచారణ పేరుతో అరెస్టు చేయించి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారన్నారు. ఇల్లెందులోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్ జబ్బార్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో దిండిగాల మాట్లాడారు.
ఫార్ములా-ఈ రేస్‌లో తన తప్పేమీ లేదని, తనపై లై డిటెక్టర్ ఉపయోగించి నిజాలు బయటపెట్టాలని కేటీఆర్ ఎప్పుడో రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరినా రేవంత్ సమాధానం చెప్పలేదని విమర్శించారు. కేసులు, జైళ్లు, ఉద్యమాలు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు కొత్త కాదని, ఎంత అణచివేతకు పాల్పడితే అంత ఎత్తుకు లేచి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు రంగనాథ్, అబ్దుల్ నబీ, లలిత్‌కుమార్ పాసి, మూలగుండ్ల ఉపేందర్‌రావు, కడగంచి వీరస్వామి, రాంలాల్ పాసి, సర్దార్, పాలడుగు రాజశేఖర్, పరకపల్లి రవిగౌడ్, మహేందర్, కిషన్ పాసి, ఇమ్రాన్, అజర్ అలీ తదితరులు పాల్గొన్నారు.