అశ్వారావుపేట, డిసెంబర్ 21 : రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీబీ (జిల్లా సహకార కేంద్రం బ్యాంకు), పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పర పతి సహకార సంఘం)ల పాలక వర్గాలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆకస్మిక నిర్ణయం తీసుకుంది. సంఘాల చైర్మన్ల సేవలకు స్వస్తి చెప్పింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల స్థానంలో పర్సన్ ఇన్చార్జులను నియమించనుంది. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను జిల్లా అధికారులు ప్రభుత్వానికి అందించనున్నారు.
తదుపరి ఎన్నికలకు వెళ్లేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు కసరత్తు చేస్తుంది. అయితే, కొత్తగా ప్రతిపాదనలకు వచ్చిన సంఘాలను ఏర్పాటుచేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లవచ్చనే అంచనాలో జిల్లా అధికారులు ఉన్నారు. గడువు ముగిసిన తర్వాత డీసీఎంఎస్ (జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ)కు మాత్రం పదవీ కాలం పొడిగించలేదు. అదనపు కలెక్టర్‌ను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డీసీసీబీతో పాటు మొత్తం 97 సహకార సంఘాలు ఉన్నాయి. కొత్తగా మరో 28 సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. వీటితో కలిసి సంఘాల సంఖ్య 125కు చేరుతుంది.
2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా.. 2024 ఫిబ్రవరి 15తో సహకార సంఘాల పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లకుండా 6 నెలలపాటు పాలకవర్గాల పదవీ కాలాన్ని పొడిగించింది. తర్వాత ఆ ఏడాది ఆగస్టు 14తో ఆ గడువు కూడా ముగియడంతో అప్పటికే ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత కారణంగా వెనక్కి తగ్గిన సీఎం రేవంత్‌రెడ్డి.. మరోసారి పదవీ కాలాన్ని పొడిగించారు. కానీ, ఆ పొడింగింపు ఎంతకాలమనే విషయాన్ని స్పష్టం చేయలేదు. ‘తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు’ అంటూ ఆ పొడిగింపు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అయితే, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండోసారి పొడిగించిన పదవీకాలం గడువు ఉన్నప్పటికీ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఈ నెల 19న పీఏసీఎస్ పాలకవర్గాలను రద్దు చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో 2020లో డీసీసీబీ, పీఏసీఎస్‌లకు ఎన్నికలు జరిగాయి. వీటి పదవీ కాలం ముగిసే సమయానికి 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి బీఆర్ఎస్ హయాంలో ఎన్నికైన పాలకవర్గాల గడువునే కాంగ్రెస్ ప్రభుత్వం పొడిగిస్తూ వస్తోంది. ఇప్పటికే రేవంత్‌రెడ్డి సర్కారు పాలకవర్గాలకు రెండు పర్యాయాలు గడువు పొడిగింది.
పాలకవర్గాలను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే నిర్ణయాన్ని ఇంకా తీసుకోలేదు. ప్రస్తుతం రద్దయిన పాలకవర్గాల స్థానంలో పర్సన్ ఇన్చార్జులను నియమించనుంది. దీనికి కావాల్సిన ప్రతిపాదలను జిల్లాల అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రభుత్వానికి అందించింది. 2024లో డీసీఎంఎస్ పాలకవర్గం పదవీకాలం ముగిసినా పొడిగించకుండా అదనపు కలెక్టర్‌ను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించింది.
మళ్లీ ఎన్నికలు జరిగే వరకు పర్సన్ ఇన్చార్జులే పాలన సాగించనున్నారు. పర్సన్ ఇన్చార్జులతోపాటు సీఈవోలు, సిబ్బంది పనిచేస్తారు. ఈ సమయంలోనే ఎప్పుడు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన చేయనుంది. దీనిపై ఒకవైపు కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో అధికార కాంగ్రెస్‌తోపాటు పాలక వర్గాలు ఒక్కసారిగా కంగుతిన్నాయి. ఇంకా రెండు నెలలకు పైగా వ్యవధి ఉండగా ప్రభుత్వం ఈ సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేయటంతో షాక్‌కు గురయ్యాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఒక డీసీసీబీతోపాటు 97 పీఏసీఎస్‌లు ఉన్నాయి. వీటిలో ఖమ్మం జిల్లాలో 76, భద్రాద్రి జిల్లాలో 21 ఉన్నాయి. అయితే, ఎన్నికలకు వెళ్లేందుకు కసరత్తు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం మరో పక్క కొత్త పీఏసీఎస్‌లు ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తోంది. వీటిని ఏర్పాటు చేసిన తర్వాతే ఎన్నిలకు వెళ్లాలనే నిర్ణయంలో ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్లను నియమించాలన్న మొదటి ఆలోచనను కాంగ్రెస్ సర్కారు విరవించుకుంది. ఎన్నికలకే వెళ్లేందుకే సిద్ధమవుతోంది. ఒకపక్క ‘వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమం, బోనస్ చెల్లింపుల పట్ల కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ దశలో ఎన్నికలకు వెళుతుందా?’ అనే ప్రశ్న రైతులతోపాటు ఆ శాఖ అధికారుల్లోనూ వ్యక్తం అవుతోంది.
సహకార సంఘాల సేవలు విస్తరించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉమ్మడి జిల్లాలో ఉన్న పీఏసీఎస్‌లతోపాటు కొత్త పీఏసీఎస్‌లను ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 76, భద్రాద్రి జిల్లాలో 21 పీఏసీఎస్‌లు ఉన్నాయి. వీటికి తోడు ఖమ్మం జిల్లాలో కొత్తగా 19, భద్రాద్రి జిల్లాలో కొత్తగా 9 చొప్పున పీఏసీఎస్‌ల ఏర్పాటుకు అధికారుల నుంచి ప్రతిపాదనలు తీసుకుంది. వీటితో కలిపితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పీఏసీఎస్‌ల సంఖ్య 125కు పెరుగుతుంది. వీటితోపాటు ఉద్యోగుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంటుంది.