భద్రాచలం, మే 7: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శనివారం శ్రీరామ దీక్ష విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాతం, ఆరాధన, సేవాకాలం, ఆరగింపు, నివేదన, నిత్య పూజలు, నిత్య హోమాలు జరిపారు. అనంతరం బేడా మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి, ముందుగా విశ్వక్సేన ఆరాధన, కర్మణః పుణ్యాహచన జరిపారు. అనంతరం స్వామివారి వెండి పాదుకలను దేవస్థానం ఏఈవో శ్రావణ్‌కుమార్ శిరస్సున ధరించి, శ్రీరామ దీక్షాపరులతో ఆలయ చుట్టూ ప్రదక్షిణ చేశారు.
అనంతరం శ్రీరామ అష్టోత్తర శతనామార్చన, దీపధూప నైవేద్యాలు సమర్పించారు. తరువాత పాదుకలకు 108 నామాలతో పుష్పార్చన నిర్వహించారు. అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీరామదీక్షా పరులతో ఇరుముడి పూజ చేయించారు. అనంతరం వేద పండితులు ఆలయ ప్రధానార్చకులు ఇరుముడిని మూటగట్టి భక్తుల శిరస్సుపై ధరింపజేయగా భద్రగిరి ప్రదక్షిణ, గ్రామ ప్రదక్షిణ చేసి గర్భాలయం చేరుకున్నారు. భద్రుడి మండపంలో అర్చకులు దీక్షాపరుల తులసిమాలను విసర్జింపచేశారు. అనంతరం శ్రీరామభక్తులు పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి నూతన వస్త్రధారణ చేసి రామయ్యను దర్శించుకున్నారు. సాయంత్రం 4 గంటలకు సాయంకాలం ఆరాధన, 5 గంటలకు దర్బారు సేవ, యాగశాలలో రథాంగ హోమం జరిపారు. పవిత్ర గోదావరి పుణ్యజలాలతో రథాన్ని సంప్రోక్షణ చేశారు. అనంతరం స్వామివారిని రథంపై ఉంచి చక్కెర పొంగలి నివేదన చేశారు.
ఆదివారం నిత్యకల్యాణం జరిపిన తరువాత అదే వేదికపై రామయ్యకు పట్టాభిషేకం నిర్వహించనున్నారు. శ్రీరామ దీక్షాపరులు కేవలం రూ.100 చెల్లించి ఈ పట్టాభిషేకంలో పాల్గొనవచ్చని దేవస్థానం అధికారులు తెలిపారు.