చండ్రుగొండ/ ఇల్లెందు/ భద్రాచలం, మార్చి 25: రిటైర్డు ఉద్యోగులకు నష్టం కలిగించే వ్యాలిడేషన్ యాక్ట్-2025ను రద్దు చేయాలని, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా ఆయా మండల తహసీల్దార్ కార్యాలయాల ఎదుట రిటైర్డు ఉద్యోగులు బుధవారం ధర్నాలు చేశారు. మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించి తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. చండ్రుగొండ మండల కేంద్రంలో జరిగిన ధర్నాలో తెలంగాణ రిటైర్డు ఉద్యోగుల సంఘం చండ్రుగొండ అధ్యక్షుడు కాళ్లూరి సుధాకర్‌రావు మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం అడ్డదారిలో తీసుకొచ్చిన వ్యాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు.
స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నారు. కేంద్రం పెన్షన్‌దారుల హక్కులను కాలరాయాలని చూడటం దుర్మార్గమని, పెన్షన్‌దారుల హక్కులకు భంగం కలిగేలా తీసుకొచ్చిన నూతన చట్టాల్ని రద్దు చేయాలన్నారు. తమ సమస్యను పరిష్కరించే వరకు దశలవారీగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తహసీల్దార్ సంధ్యారాణికి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. రామక్రిష్ణమాచారి, మస్తాన్, పులి సత్యం, పద్మావతి పాల్గొన్నారు. ఇల్లెందులో పెన్షనర్ భవన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు రిటైర్డు ఉద్యోగులు పెన్షనర్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీగా వచ్చి తహసీల్దార్ రవికుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
పెన్షనర్ సంఘం మండల అధ్యక్షుడు డి.స్వామిదాస్ మాట్లాడుతూ పెన్షన్‌దారులందరికీ ఆరోగ్యకార్డులు ఉచితంగా పంపిణీ చేయాలని, బకాయిపడిన డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఎంఎం చారి, సీహెచ్ రమేష్, రాంబాబు, ముత్తయ్య, రామ్మూర్తి, లక్ష్మయ్య, క్రిష్ణప్రసాద్, రాజయ్య, భావనారాయణ, విజయకుమార్, రాజమణి, లక్ష్మి, రాధ పాల్గొన్నారు. భద్రాచలంలో ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. భద్రాచలం పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు జి.భూషణరావు, కార్యదర్శి కె.మధుసూదన్ మాట్లాడుతూ కొత్త చట్టం వల్ల పాత పెన్షన్లకు కొత్త పెన్షన్లకు భారీ వ్యత్యాసం ఉంటుందన్నారు. చట్టాన్ని రద్దు చేయకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎన్ఎస్ హజరయ్య, మధుసూదన్‌రావు, వెంకన్న, హనుమంతరావు, వై రామచంద్రరావు, నరసింహులు, భూపతిరావు పాల్గొన్నారు.