పాట్నా: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఆందోళనల సందర్భంగా అరెస్ట్ చేసిన విద్యార్థులను విడుదల చేస్తామన్న బీహార్ ప్రభుత్వ హామీ నెరవేరకపోవడంతో పాట్నాలో వందలాది మంది విద్యార్థులు, యువతీయువకులు రోడ్డెక్కి భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎన్ఎస్యూఐ, ఏఐఎస్ఎఫ్, డీవైఎఫ్ఐ తదితర సంఘాల జెండాలతో గాంధీ మైదాన్ వద్ద గుమిగూడిన నిరసనకారులు ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి యత్నించారు. అయితే సీఎం నివాసానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లను ప్రయోగించారు.
నీట్ యూజీ పరీక్షలో తాము సమర్పించిన ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లోని జవాబులకు..ఎన్టీఏ అప్లోడ్ చేసిన ఓఎంఆర్ షీట్ జవాబులకు తేడాలున్నాయంటూ ఆరుగురు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై వెంటనే విచారణ చేపట్టాలని విద్యార్థుల తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు. వీరి అభ్యర్థనపై స్పందించిన సీజేఐ..పిటిషన్పై విచారణ చేపడుతామని అన్నారు.