Bihar Floods : బిహార్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. నేపాల్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా బిహార్‌లోకి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆరు జిల్లాల్లోని ఐదు లక్షల మంది ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారు. రిలీఫ్ ప్యాకెట్ మీద పడటంతో ఒకరు మరణించారు. నేపాల్‌లో వర్షాలు, అక్కడి వరదల కారణంగా గండక్ బ్యారేజ్ నుంచి నీరు భారీగా బిహార్‌ను ముంచెత్తుతోంది. మోతిహరి, బెట్టియా, ముజఫ్ఫర్‌పూర్, శరణ్, దర్భంగా, గోపాల్‌గంజ్ జిల్లాల్లో గంగ, గండక్, కోసి నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి.
దీంతో ఈ నదుల పరిధిలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద ప్రభావంతో అనేక ప్రాంతాలు నీట మునగడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక హెలికాప్టర్ నుంచి రిలీఫ్ ప్యాకెట్లను సిబ్బంది కిందికి విసిరేశారు. ఈ క్రమంలో హెలికాప్టర్ పై నుంచి ఒక ప్యాకెట్ మీద పడటంతో 58 ఏళ్ల ఒక వృద్ధుడు మరణించాడు. ఈ ఘటన శరణ్ జిల్లాలో, శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. అమ్నోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్షురాంపూర్ గ్రామంలో జరిగింది. మృతుడిని అదే గ్రామానికి చెందిన అనిల్ కమార్ సింగ్‌గా గుర్తించారు. ఈ గ్రామ పరిధిలో ఒక సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, ఇక్కడికి రిలీఫ్ ప్యాకెట్ విసిరేయగా ఈ ఘటన జరిగింది.
ప్యాకెట్ తలమీద పడటంతో అతడు మరణించాడు. అతడి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బిహార్‌లో వరద ప్రభావం పెరగడంతో ప్రభుత్వం 242 కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రెండు సహాయక కేంద్రాలు కొనసాగుతున్నాయి. 41 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి.