ఖమ్మం, మార్చి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రైతులపై వివక్ష.. ఉత్తరాది రాష్ర్టాలకు ఒక న్యాయం.. మన రాష్ర్టానికి మరోక న్యాయం.. రాష్ట్ర ప్రభుత్వమంటే కక్ష.. రాష్ట్ర మంత్రులు యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయమంటే చిన్నచూపు.. ప్రజలతో నూకలు తినిపించాలని హేళన.. ఇదీ కేంద్ర ప్రభుత్వ వైఖరి.. ఈ తీరుపై ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.. కేంద్రానికి నూకలు చెల్లే రోజులు వచ్చేశాయని రైతులు మండిపడుతున్నారు.. శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధులు గ్రామాలు, మండల పరిషత్తుల్లో కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలని తీర్మానాలు చేశారు.. వాటిని కేంద్రానికి పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.. మరోవైపు కేంద్రం మెడలు వంచేందుకు టీఆర్ఎస్ దశలవారీ పోరుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే ఉభయ జిల్లాల పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు, తాతా మధు నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించారు.. కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు.. ఉగాది తర్వాతి రోజు నుంచి ఆందోళనలు ఉధృతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..
యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనాలని రాష్ట్ర మంత్రులు అడిగినందుకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గురువారం ఢిల్లీలో అపహాస్యంగా, అవహేళనగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆయన అనుచిత వ్యాఖ్యలపై ఉమ్మడి జిల్లా ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. రెండోరోజు శనివారమూ గోయల్ వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్ర ప్రజలతో నూకలు తినిపించాలని కేంద్ర మంత్రి అన్న మాటలు అహంకారపూరితంగా ఉన్నాయంటున్నారు. కేంద్రం తెలంగాణ రైతులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రైతాంగం నుంచి కూడా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి నూకలు చెల్లే రోజులు దగ్గరపడ్డాయంటూ మండిపడుతున్నారు. బీజేపీ పతనానికి ఈ వ్యాఖ్యలే నాంది పలుకుతాయంటున్నారు. శనివారం ఉమ్మడి జిల్లాలోని గ్రామాలు, మండల పరిషత్తుల్లో ప్రజాప్రతినిధులు కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలని తీర్మానాలు చేశారు. వాటిని కేంద్రానికి పంపించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
వరి సాగు తప్పనిసరి..
తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత మిషన్ భగీరథ ద్వారా చెరువుల పునరుద్ధరణ జరిగింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తవడంతో సాగునీరు సమృద్ధిగా దొరుకుతున్నది. వీటికి తోడు రైతులకు సీజన్‌కు ముందే రైతుబంధు సాయం అందుతున్నది. దీంతో ఏటికేడు వరి సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని చెప్పడంతో రైతులు ఇతర పంటలపై దృష్టి సారించారు. కానీ కొన్నిచోట్ల ఇతర పంటలకు పండించేందుకు అవకాశం లేకపోవడంతో యాసంగిలో వరి మాత్రమే పండించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆందోళనలకు సిద్ధం..
ధాన్యం కొనుగోలు వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న టీఆర్ఎస్ దశల వారీ ఆందోళనలకు సిద్ధమవుతున్నది. అందుకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నది. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు ఆందోళనలు చేపట్టనున్నది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేవరకు ఉమ్మడి జిల్లాలో దశల వారీగా ఆందోళన చేపట్టేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఇతర మంత్రులతో కలిసి ఢిల్లీలో మకాం వేశారు. ఎంపీ, టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు ఇతర ఎంపీలతో కలిసి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే నియోజకవర్గస్థాయి సమావేశాలు నిర్వహించి బీజేపీపై సమర శంఖం పూరించారు. ఏప్రిల్ 2న ఉగాది. ఆరోజు తర్వాత నుంచి ఉమ్మడి జిల్లాలో ఆందోళనలను ఉధృతం చేసేందుకు పార్టీ శ్రేణులు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఉభయ జిల్లాల పార్టీ అధ్యక్షులు తాతా మధు, రేగా కాంతారావు ఇప్పటికే సమావేశాలు నిర్వహించి భవిష్యత్ ప్రణాళికలపై కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. పంజాబ్ తరహాలోనే తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్తులు, ప్రాథమిక సహకార సంఘాలు, మున్సిపాలిటీల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించే విధంగా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకుంటున్నారు.
వడ్లు కొనుడు మానేసి ఉల్టా మాటలు వద్దు..
ఢిల్లీల పెద్ద మంత్రి ఎవలో మమ్మల్ని నూకలు తినమని చెప్పిండట. తినే నూకలు తినే కర్మ మాకు లేదు. మా రైతులు వరి బాగా పండి స్తున్నరు. వడ్లు కొనుడు మానేసి ఉల్టా మాటలు వద్దు. మమ్మల్ని చిన్నతనం చేసి మాట్లాడిన వాళ్లు కచ్చితంగా బుద్ధి తెచ్చుకుంటరు. ఇయ్యాల తెలంగాణ ప్రజలు ఎట్ట బతుకుతున్నరో దేశానికి తెలుసు. దేశానికి అన్నం పెట్టే మా రైతులు నూకలు తినరు.
– బైరోజు యాదమ్మ, నాయుడుపేట