ఖమ్మం, మార్చి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనాలని రాష్ట్ర మంత్రులు కేంద్రాన్ని కోరినందుకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గురువారం ఢిల్లీలో అవహేళనగా మాట్లాడిన సంగతి విదితమే. ఆయన అనుచిత వ్యాఖ్యలపై ఉమ్మడి జిల్లాప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మూడోరోజు ఆదివారమూ గోయల్ వ్యాఖ్యలను ఖండించారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేసేలా ఒత్తిడి పెంచేందుకు పంచాయతీలు, మండల పరిషత్తుల్లో పాలకవర్గాలు తీర్మానాలు చేస్తున్నాయి. ఆదివారం ఉమ్మడి జిల్లాలో డీసీఎంఎస్, డీసీసీబీ ఆధ్వర్యంలో తీర్మానాలు ప్రారంభమయ్యాయి. పాల్వంచలో జరిగిన సమావేశంలో సొసైటీ, డీసీఎంఎస్ పాలకవర్గాలు తీర్మానించాయి. తీర్మాన పత్రాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించేలా చర్యలు తీసుకుంటున్నాయి.
యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనాలని రాష్ట్ర మంత్రులు కోరినందుకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గురువారం ఢిల్లీలో అపహాస్యంగా, అవహేళనగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆయన అనుచిత వ్యాఖ్యలపై ఉమ్మడి జిల్లా ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మూడోరోజు ఆదివారమూ గోయల్ వ్యాఖ్యలను ఖండించారు. మరోవైపు కేంద్రం ధాన్యం కొనేవరకు ఉద్యమించేందుకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు దశల వారీగా ఉద్యమించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తున్నదని, రాష్ర్టానికి ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదని ప్రజలకు వివరించనున్నారు. పంజాబ్‌లో పంటను కొనుగోలు చేస్తున్నట్లుగానే ఇక్కడ కూడా కొనుగోలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురానున్నారు.
పంచాయతీలు, మండల పరిషత్తుల్లో తీర్మానం
కేంద్రం ధాన్యం కొనుగోలు చేసేలా ఒత్తిడి పెంచేందుకు పంచాయతీలు, మండల పరిషత్తుల్లో పాలకవర్గాలు తీర్మానాలు చేస్తున్నాయి. ఆదివారం ఉమ్మడి జిల్లాలో డీసీఎంఎస్, డీసీసీబీల పరిధిలో తీర్మానాలు ప్రారంభమయ్యాయి. పాల్వంచలో జరిగిన సమావేశంలో సొసైటీ, డీసీఎంఎస్ పాలకవర్గాలు తీర్మానం చేశాయి. తీర్మాన పత్రాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాయి. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ శేషగిరిరావు, వైస్ చైర్మన్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇకపై మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లోనూ తీర్మానాలు జరుగనున్నాయి. తీర్మానాలన్నీ ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. పెనుబల్లి మండలంలో జరిగిన సభలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీర్మాన పత్రంపై సంతకం చేశారు.
ఉగాది తర్వాత ఆందోళనలు..
వచ్చే ఉగాది తర్వాత ఉమ్మడి జిల్లాలో ఆందోళనలు ఉధృతం కానున్నాయి. టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రతి ఇంటిపై నల్ల జెండా ఎగురవేయనున్నాయి. మండల స్థాయిలో ఒకరోజు నిరసన దీక్ష చేపట్టనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఉభయ జిల్లాల పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు, తాతా మధు నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు.