పంజాబ్ మాదిరిగా తెలంగాణ ధాన్యాన్నీ సేకరించాలి
అన్నదాతల కోసం శక్తివంచన లేకుండా పోరాటం
కేంద్రానికి కనువిప్పు కలిగేలా ఢిల్లీ వరకూ ఉద్యమం
అన్ని గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవంగా తీర్మానాలు
ప్రధాని మోదీ, కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు ప్రతులు
నమస్తే నెట్వర్క్: తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కోరారు. పంజాబ్ మాదిరిగానే తెలంగాణ ధాన్యాన్ని సైతం కేంద్రమే సేకరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లోనూ, కొన్ని మండల పరిషత్లలోనూ తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. వాటిని ప్రధాని మోదీకి, కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు పంపారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయం గురించి దేశమంతటికీ తెలిసేలా గళం విప్పుతామన్నారు. అన్నదాతలకు అండగా ఉంటూ శక్తివంచన లేకుండా పోరాడుతామన్నారు. తెలంగాణ రైతులు నూకలు తినాలంటున్న కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌కు గుణపాఠం చెప్పి తీరుతామని స్పష్టం చేశారు. తెలంగాణ రైతులకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని, అవమానాన్ని లోకానికి తెలియజెప్పేలా గ్రామస్థాయిలో గల్లీ నుంచి జాతీయ స్థాయిలో ఢిల్లీ వరకూ ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల పట్ల సమానత్వాన్ని చూపించకుండా వివక్షను చూపుతోందని ఆరోపించారు.
గ్రామ పంచాయతీల్లో..
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తకారాయిగూడెం, గంగదేవిపాడు, కల్లూరు మండలం కొర్లగూడెం, సత్తుపల్లి మండలం సదాశివునిపాలెం, పాకలగూడెం, బేతుపల్లి, గంగారం గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపారు. జూలూరుపాడు మండలంలోని 24 గ్రామాల్లో పంచాయతీల్లోనూ తీర్మానాలు చేశారు.
ధాన్యం కొనేవరకూ ఉద్యమం: జడ్పీ చైర్మన్
బోనకల్లు, మార్చి 26: రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకూ ఉద్యమం కొనసాగుతుందని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు స్పష్టం చేశారు. తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతూ బోనకల్లు మండల పరిషత్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఎంపీపీ కంకనాల సౌభాగ్యం అధ్యక్షతన శనివారం జరిగిన మండల పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్మన్ మాట్లాడారు. తెలంగాణ ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. కాగా, రాష్ట్రంలోని రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని కోరుతూ రామాపురం ఎంపీటీసీ ముక్కపాటి అప్పారావు తీర్మానాన్ని ప్రతిపాదించారు. దానిని చిరునోముల ఎంపీటీసీ కోటపర్తి హైమావతి బలపరిచారు. దీంతో ఎంపీపీ ఆ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. దాని ప్రతులను కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌కు పంపిస్తున్నట్లు ఎంపీపీ తెలిపారు.
వడ్లు కొనకుండా వంకర మాటలొద్దు..
కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనకుండా వంకర మాటలు మాట్లాడడం సరికాదు. దేశంలో ఇంకోచోట వడ్లు కొని మా దగ్గర కొనకపోవడం దారుణం. రైతులను ఆగం చేయడం మంచిది కాదు. వడ్లు కొనేది వదిలి పెట్టి వంకర మాటలు ఎందుకు మాట్లాడుతున్నరు. మాకు నూకలు తినే అవసరం ఎందుకొస్తది. పెద్దస్థాయిలో మంత్రి అయి ఉండి నూకలు తినమని అపహాస్యం చేసుడెందుకు ? మా ఒడ్లు వద్దు అనేటోళ్లకు బుద్ధి చెప్పాల్సిందే. కేంద్రం వరి సాగు చేబట్టన్నందుకు వందల ఎకరాలు ఖాళీగానే ఉన్నాయి. మాకు కూలి దొరుకుత లేదు. ఢిల్లీ పెద్దలు ఆలోచన చేయాలె. వడ్లు కొని రైతులను ఆదుకోవాలి.
– జల్లా యశోద, వ్యవసాయ కూలీ, ఆరెంపుల, ఖమ్మం రూరల్
ప్రజలను అవహేళన చేయడం హేయమైన పని
తెలంగాణ ప్రజల వీరోచిత చరిత్ర కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలియనట్లుంది. మున్ముందు ఆయనకే నూకలు తినే గతి పడతది. తన ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు చరిత్రను తెలియజేయాల్సి ఉంటుంది. ఇక్కడి ప్రజలు భూమి కోసం, భుక్తి కోసం తుపాకీలు పట్టారు. బీజేపీ నేతలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మా దగ్గర పండే వడ్లను కొనడం చేతకాలేదు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నూకలు తినండి అని అవహేళన చేయడం హేయమైన పని. ధాన్యం కొనుగోలు ఏ రాష్ట్రంలోనైనా ఒకే విధంగా ఉండాలి. కానీ బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక న్యాయం, పంజాబ్‌కో న్యాయం చూపిస్తున్నది. ఇలాంటి విధానం మరే ఇతర దేశంలోనైనా ఉంటుందా? ఇంత అన్యాయమా? ఇక్కడి రైతులు రైతులుకారా?
– బిచ్చాల తిరుమలరావు, న్యాయవాది