కారేపల్లి, ఏప్రిల్ 24 : కారేపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంటున్న వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ము, డబ్బులు రాత్రికి రాత్రే దొంగలు మాయం చేస్తారేమోనని భయంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వేల రూపాయలు ఖర్చు చేసి మండల కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా ప్రస్తుతం వాటి పనితీరు సవ్యంగా లేదు. దీంతో దొంగలకు దొంగతనం చేసేందుకు సులువుగా మారింది. ఇటీవల కారేపల్లి పోస్ట్ ఆఫీస్ లోకి దొంగలు చొరబడి దోపిడీకి యత్నించారు. అయితే వారి ప్రయత్నం ఫలించలేదు. కార్యాలయంలోని క్యాష్ చెస్ట్(లాకర్) తెరవాలని చూడగా ఓపెన్ కాకపోవడంతో వెనుతిరిగి పోయారు. శివాలయం సమీపంలో గల ఓ ఇంటిలోకి తాళం పగులగొట్టి చొరబడ్డారు. ఇంట్లో విలువైన ఆభరణాలు, నగదు లేకపోవడంతో బీరువాలోని బట్టలు చిందరవందగా పడేసి పూజ గదిలోని వెండి పూజా సామగ్రిని తీసుకువెళ్లారు.
అలాగే సింగరేణి గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో గల ఓ ఇంట్లోకి చొరబడగా ఏమీ దొరకకపోవడంతో ఇంట్లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తిని వెళ్లారు. కాగా కారేపల్లి పోలీసుల అదుపులో ఓ దొంగ ఉన్నట్లు సమాచారం. మండల కేంద్రంలో దొంగతనాలకు పాల్పడిన ఆ వ్యక్తి రైలు ఎక్కి పారిపోతుండగా ఖమ్మం సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఖమ్మం సిసిఎస్ పోలీసుల విచారణలో ఆ వ్యక్తి కారేపల్లిలో పలుచోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకోవడంతో స్థానిక పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.