కారేపల్లి, ఏప్రిల్ 19 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో గల అంబేద్కర్ నగర్ ఎస్సీ కాలనీకి చెందిన స్మశాన వాటికకు హద్దులు ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక ఎస్సీ కాలనీవాసులు శనివారం తాసీల్దార్ సంపత్కుమర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ పూర్వీకుల కాలం నుండి ఈ స్మశాన వాటికను వినియోగిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇటీవల తమ కాలనీకే చెందిన ఓ వ్యక్తి స్మశాన వాటికను కలుపుకుని పట్టాదారు పాస్ పుస్తకం పొందినట్లు తెలిపారు.
ఈ స్మశాన వాటికకు 15 ఏళ్ల కిందట మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్డు సైతం నిర్మించడం జరిగిందన్నారు. అంతేకాకుండా సుమారు వంద సంవత్సరాలకు ముందుగా చేపట్టిన సమాధులే అందుకు ప్రత్యక్ష సాక్షమన్నారు. కావునా ఆక్రమణకు గురికాకుండా స్మశాన వాటికకు హద్దులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంజయ్య, శంకర్రావు, రామారావు, ఉపేందర్, మీన్ను, శీను పాల్గొన్నారు.