కారేపల్లి (కామేపల్లి), ఆగస్టు 13 : తమపై హత్యాయత్నానికి కుట్ర పన్నుతున్న వ్యక్తుల నుండి రక్షణ కల్పించాలని కోరుతూ బుధవారం కామేపల్లి పోలీస్ స్టేషన్లో మద్దులపల్లి గ్రామానికి చెందిన సామ మోహన్ రెడ్డి ఫిర్యాదు అందజేశారు. తనతో పాటు నూకల ఉపేందర్‌ను హత్య చేయించేందుకు మద్దులపల్లి గ్రామానికే చెందిన గడబోయిన హరీశ్ మహబూబాబాద్ లోని ఓ ముఠాతో సుఫారీ కుదిరించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అందుకుగాను రూ.4 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని, రూ.లక్ష ముందస్తుగా చెల్లించినట్లుగా మాట్లాడిన ఫోన్ సంభాషణ రికార్డును పోలీసులకు వినిపించాడు. ఈ విషయమై స్థానిక సీఐ, ఏసీపీ, సీపీలను కలిసి తమకు హరీశ్ నుండి ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించాలని కోరుతున్నట్లు తెలిపాడు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు ఉన్నారు.