బోనకల్లు, జూన్ 18 : ఖమ్మం టూ బోనకల్లు వయా పొద్దుటూరుకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం ఆర్టీసీ డిపో సూపరింటెండెంట్ బత్తినేని రాములుకు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పొనుకుల సుధాకర్ మాట్లాడుతూ.. బోనకల్లు మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు చదువుకుంటున్నట్లు తెలిపారు. ఈ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు గోవిందపురం(ఎల్ ), లక్ష్మిపురం, రావినూతల విద్యార్థులకు బస్సు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మం నుంచి బోనకల్లు, రావినూతల, గోవిందాపురం(ఎల్), లక్ష్మీపురం, ప్రొద్దుటూరు వరకు బస్ సర్వీసులను నడిపించాలని కోరారు. అలాగే విజయవాడ వెళ్లే ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఖమ్మం టూ విజయవాడ వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసును ముష్టికుంట్లలో స్టాప్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గూగులోతు నరేశ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు హరీశ్, ఎస్ఎఫ్ఐ బోనకల్ మండల నాయకులు మర్రి సాయికుమార్, వల్లంకొండ సుశాంత్, డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కూరపాటి శ్రీను, డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు రాయపాటి నాగరాజు, కృష్ణ, గుగులోతు మల్లిక పాల్గొన్నారు.