మణుగూరు టౌన్, జూలై 5: పినపాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలని పార్టీ సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్), పార్టీ సభ్యత్వ నమోదు అంశాలపై పార్టీ నాయకులతో మణుగూరులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.
ఎస్ఐఆర్ పట్ల బీఆర్ఎస్ బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏలు) సహా బూత్ అధ్యక్షులు, నాయకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించి ఓటరు నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరూ ఓటరు జాబితాలో నమోదయ్యేలా పనిచేయాలని ఆదేశించారు. అలాగే, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బూత్‌స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్‌స్థాయి ఏజెంట్లు పాల్గొన్నారు.