కొత్తగూడెం అర్బన్, జనవరి 26: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. కొత్తగూడెంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలని తుంగలో తొక్కిందని, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను నిలువునా ముంచిందని విమర్శించారు. ఏ వర్గం కూడా ఆనందంగా లేదని అన్నారు.
బోగస్ హామీలతో గద్దెనెక్కిన ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రేషన్‌కార్డుల పంపిణీ, డబుల్ బెడ్రూం, ఇళ్ల స్థలాలు వంటివి ఎన్నికల స్టంట్లు మాత్రమేనని, ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ గ్రామసభల పేరుతో వస్తోందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేశారు. కార్యకర్తలంతా ఐక్యంగా ముందుకెళ్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, కాపు కృష్ణ, మాజీ ఎంపీపీ బదావత్ శాంతి, హుస్సేన్, దూడల బుచ్చయ్య, సంకుబాపన అనుదీప్, రెంటపల్లి మాధవీలత పాల్గొన్నారు.